గ్యాస్‌, కరెంటు పథకాల అమలుకు ముహూర్తం.. 27 లేదా 29..!

కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండింటి అమలుకు ముహూర్తం ఖరారైంది. గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు ఉచిత విద్యుత్‌, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ఈ నెల 27 లేదా 29వ తేదీ నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

Published : 23 Feb 2024 04:46 IST

మార్చి నుంచి అర్హులకు విద్యుత్‌ ‘జీరో’ బిల్లులు
రూ.500 చెల్లిస్తే సిలిండర్‌ అందేలా చూడాలి
మంత్రివర్గ ఉపసంఘంతో భేటీలో సీఎం రేవంత్‌ ఆదేశాలు
ఈనాడు - హైదరాబాద్‌

కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండింటి అమలుకు ముహూర్తం ఖరారైంది. గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు ఉచిత విద్యుత్‌, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ఈ నెల 27 లేదా 29వ తేదీ నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. 200 యూనిట్ల విద్యుత్‌ పథకం అర్హులకు మార్చి తొలి వారం నుంచి ‘జీరో’ బిల్లులు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. రెండు పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కరెంటు, గ్యాస్‌ పథకాలపై గురువారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం భేటీ అయ్యారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌, ట్రాన్స్‌కో- జెన్‌కో సీఎండీ రిజ్వీ, సీఎం ముఖ్యకార్యదర్శి శేషాద్రి పాల్గొన్నారు. ఈ పథకాల అమలుకు విధివిధానాలపై సమావేశంలో చర్చించారు.

ప్రజానుకూల విధానం

‘ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందించాలి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలా? గ్యాస్‌ ఏజెన్సీలకు చెల్లించాలా? వీటిలో సాధ్యాసాధ్యాలేమిట’ని సీఎం పౌరసరఫరాల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ‘ఎలాగైనా సరే లబ్ధిదారుడు రూ.500 చెల్లిస్తే సిలిండర్‌ ఇచ్చేలా చూడాలి. ప్రజలకు అనుకూల విధానాన్ని అనుసరించాలి. అవసరమైతే గ్యాస్‌ ఏజెన్సీలతో చర్చించాలి. ప్రభుత్వం తరఫున సబ్సిడీ నిధుల్ని వెంటనే వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలి’ ’అని రేవంత్‌ అధికారులకు సూచించారు.

సవరణలకు అవకాశం: తెల్ల రేషన్‌కార్డుండి.. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడేవారందరికీ గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేయాలని సీఎం స్పష్టం చేశారు. ‘దరఖాస్తుల్లో రేషన్‌కార్డు నంబరు, విద్యుత్‌ కనెక్షన్ల నంబర్లను పొరపాటుగా నమోదు చేసినవారు ఉంటే వారు ఆ వివరాలను సవరించుకునేందుకు అవకాశం కల్పించాలి. విద్యుత్‌ బిల్లుల వసూలు కేంద్రాలు, సర్వీస్‌ సెంటర్లలో సవరణ ప్రక్రియను చేపట్టాలి. ఈ విషయం ప్రతి గ్రామంలో ప్రజలందరికీ తెలిసేలా ఫ్లెక్సీల ద్వారా తగినంత ప్రచారం చేయాలి. తప్పులను సవరించుకున్న వారికి తదుపరి నెల నుంచి ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేయాలి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు