మస్కా కొడితే.. ఉద్యోగాలు పోతాయ్‌!

‘అమలుకు సాధ్యమయ్యే సూచనలే చేయాలి. ఒక మంత్రికి ఒకటి.. మరో మంత్రికి మరొకటి చెప్పి మస్కా కొట్టొద్దు. అలా చేస్తే ఉద్యోగాలు పోతాయ్‌!’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు.

Published : 23 Feb 2024 06:49 IST

ఖమ్మం సీఈ తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం
పాలేరు కింద నీళ్లు కావాలన్న మంత్రి పొంగులేటి
సూర్యాపేట.. కోదాడల్లో తాగునీటికి సమస్యలొస్తాయన్న మంత్రి ఉత్తమ్‌  

‘అమలుకు సాధ్యమయ్యే సూచనలే చేయాలి. ఒక మంత్రికి ఒకటి.. మరో మంత్రికి మరొకటి చెప్పి మస్కా కొట్టొద్దు. అలా చేస్తే ఉద్యోగాలు పోతాయ్‌!’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. తాగునీటి సరఫరాపై గురువారం సచివాలయంలో నీటిపారుదల, రెవెన్యూ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. చర్చ సందర్భంగా.. ఖమ్మం ప్రాంతానికి పాలేరు కింద నీళ్లు కావాలని మంత్రి పొంగులేటి కోరారు. సీఎం స్పందిస్తూ.. ‘తాగునీటికి సమస్యలున్నందున ఈ సమయంలో కష్టమవుతుంది కదా’ అని పేర్కొన్నారు. దీనిపై మంత్రి ఉత్తమ్‌ జోక్యం చేసుకుంటూ.. సాగర్‌లో నీళ్లు లేనందున సూర్యాపేట, కోదాడ ప్రాంతాలకు తాగునీటి సమస్యలొస్తాయని అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం సీఈ విద్యాసాగర్‌.. పాలేరు కింద ఇచ్చేందుకు నీళ్లున్నాయని చెప్పడంతో.. దీనిపై ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ స్పష్టత ఇవ్వాలని సీఎం సూచించారు. పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక- యాజమాన్య కమిటీ (ఎస్‌సీఐడబ్ల్యూఏఎం- స్కివమ్‌) సమావేశంలోనూ ఖమ్మంకు నీళ్లు ఇచ్చేందుకు నిర్ణయించారని పేర్కొన్నారు. నీళ్లు ఇవ్వడం వీలవుతుందని సీఈ సూచించగా.. సీఎం జోక్యం చేసుకుని.. ‘అసలు నీళ్లున్నాయో లేవో, ఇవ్వడానికి వీలవుతుందో లేదో ఈఎన్సీ కదా చెప్పాల్సింది’ అన్నారు. స్కివమ్‌ సమావేశంలో ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నారంటూ ఈఎన్సీని అడిగారు. ఖమ్మం సీఈ చెప్పిన సమాధానాలపై ఈ సందర్భంగా సీఎం అసహనం వ్యక్తం చేశారు. ‘ఒక్కొక్కరికి ఒక్కోలా చెబితే ఎలా.. మేం ముగ్గురం చర్చించుకోబోమని అనుకుంటున్నారా’ అంటూ సీఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని