మహేందర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడొద్దు!

మాజీ డీజీపీ, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడొద్దని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్‌, ఆయన సహచరులను సిటీ సివిల్‌ కోర్టు ఆదేశించింది.

Published : 23 Feb 2024 03:40 IST

హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్‌ను ఆదేశించిన సిటీ సివిల్‌ కోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ డీజీపీ, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడొద్దని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్‌, ఆయన సహచరులను సిటీ సివిల్‌ కోర్టు ఆదేశించింది. సమావేశాలు, ఇంటర్వ్యూలు, టీవీ, ప్రింట్‌, ఇతర మాధ్యమాల్లో పరువునష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన పరువుకు భంగం కలిగించేలా రాపోలు భాస్కర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయనను నియంత్రించేలా ఆదేశించాలంటూ మహేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సిటీ సివిల్‌ కోర్టు విచారించింది. తాను టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు చూపకుండా భాస్కర్‌ ఫిబ్రవరి 3న సీఎంకు తప్పుడు విజ్ఞాపన పత్రాన్ని అందించారని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులపైనా అసత్య ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. దురుద్దేశపూర్వకంగా మీడియాలో ఇష్టానుసారం మాట్లాడారని విన్నవించారు. పరువునష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడి తన హక్కులకు భంగం కలిగించారని మహేందర్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. పూర్వాపరాలను పరిశీలించిన న్యాయస్థానం మహేందర్‌రెడ్డికి వ్యతిరేకంగాపబ్లిక్‌, ప్రైవేటు ప్లాట్‌ఫారాలు, సామాజిక మాధ్యమాలు, వెబ్‌సైట్‌, సమావేశాల్లో ఆడియో, వీడియో పోస్టుల రూపంలోనూ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని  రాపోలు భాస్కర్‌, ఆయన అనుచరులు, సిబ్బందిని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు