రెండు వైపుల నుంచి ఎస్సెల్బీసీ సొరంగం పనులు

శ్రీశైలం ఎడమ బ్రాంచి కాలువ(ఎస్సెల్బీసీ) సొరంగం పనులను రెండు వైపులా ప్రారంభించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Published : 23 Feb 2024 03:42 IST

రెండేళ్లలో దీనితోపాటు డిండి నిర్మాణం పూర్తి
నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
నల్గొండ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డితో కలిసి సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం ఎడమ బ్రాంచి కాలువ(ఎస్సెల్బీసీ) సొరంగం పనులను రెండు వైపులా ప్రారంభించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుతోపాటు డిండి పనులనూ రెండేళ్లలో పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని రకాల అనమతులు సాధించేందుకు అధికారులతో ఒక బృందం ఏర్పాటు చేయాలని శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జాను ఆదేశించారు. రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి గురువారం రాష్ట్ర సచివాలయంలో నల్గొండ జిల్లా ప్రాజెక్టులపై ఆయన సమీక్షించారు. ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, బాలునాయక్‌, జైవీర్‌రెడ్డి, బి.లక్ష్మారెడ్డి, వేముల వీరేశం హాజరయ్యారు. ఇంజినీర్లు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా తాజా పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ... ‘‘ఎస్సెల్బీసీ ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేయడంతో పనుల్లో జాప్యం జరిగింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుంది. 44 కి.మీ. సొరంగ నిర్మాణంలో 9 కి.మీ. పనులు పెండింగ్‌ ఉన్నాయి, రెండు వైపుల నుంచి చేపట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి. డిండి, పెండ్లిపాక జలాశయాల నిర్మాణమూ చేపట్టాలి. ఇప్పటికే డిండి 95 శాతం పూర్తయ్యింది. భూ సేకరణకు రూ.90 కోట్లు అవసరం ఉంది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీ అనుమతులు సాధించే ప్రక్రియ వేగవంతం చేయాలి. వెంటనే ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉన్న పనులను ముందుగా పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో వారానికోసారి సమీక్ష చేసి వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలి’ అని మంత్రి సూచించారు. సమీక్షలో పెండింగ్‌ బిల్లులు, ఇతర సమస్యలపైనా చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు