పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలి

గ్రామ పంచాయతీల్లో తాము చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్‌ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని మాజీ సర్పంచులు డిమాండ్‌ చేశారు.

Published : 23 Feb 2024 03:43 IST

గన్‌పార్కులో మాజీ సర్పంచుల నిరసన

నారాయణగూడ, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీల్లో తాము చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్‌ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని మాజీ సర్పంచులు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ఐకాస ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి హైదరాబాద్‌ గన్‌పార్కులో గురువారం నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపైన బైఠాయించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు వారిని అరెస్టు చేసి నాంపల్లి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా ఐకాస అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్‌ మాట్లాడుతూ.. ‘‘తమ పదవీకాలంలో సర్పంచులు గ్రామాల్లో పంచాయతీ భవనాలు, డంపింగ్‌ యార్డులు, క్రీడా ప్రాంగణాలు, సీసీ రోడ్లు, రైతు వేదికలు వంటివాటిని అప్పులు చేసి నిర్మించారు. గత ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయక అప్పులపాలయ్యారు. కొందరు అప్పులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నారు. పాలక, ప్రతిపక్షాలకు తెలిసినా అసెంబ్లీ సమావేశాల్లో ఏ ఒక్కరూ చర్చించలేదు. గతంలో పాదయాత్ర నిర్వహించిన రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు తాము అధికారంలోకి రాగానే సర్పంచుల సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రిని, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిని కలిస్తే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజావాణిలోనూ వినతిపత్రాలు సమర్పించినా స్పందన లేదు’’ అని పేర్కొన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లోపు బిల్లులు చెల్లించకపోతే అన్నిచోట్ల మాజీ సర్పంచులు నామినేషన్లు దాఖలు చేస్తారని హెచ్చరించారు. సంఘం ప్రధాన కార్యదర్శి కొలను శ్రీనివాస్‌రెడ్డి వివిధ జిల్లాలకు చెందిన మాజీ సర్పంచులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని