సమ్మక్క-సారక్క వర్సిటీలో ఈ ఏడాది నుంచే ప్రవేశాలు

ములుగులో ఏర్పాటుచేస్తున్న సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నుంచే ప్రవేశాలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు.

Published : 23 Feb 2024 03:44 IST

మెజారిటీ సీట్లు గిరిజన విద్యార్థులకే
కిషన్‌రెడ్డి వెల్లడి
జాతరలో మొక్కులు చెల్లించుకున్న కేంద్ర మంత్రి

ఈనాడు- వరంగల్‌, దిల్లీ; కాజీపేట, న్యూస్‌టుడే: ములుగులో ఏర్పాటుచేస్తున్న సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నుంచే ప్రవేశాలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. వర్సిటీలో మెజారిటీ సీట్లు గిరిజన బిడ్డలకే కేటాయిస్తామని ప్రకటించారు. గురువారం ఆయన మేడారం జాతరలో పాల్గొని, సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించారు. రాష్ట్ర మంత్రి అనసూయ సీతక్క కేంద్ర మంత్రికి స్వాగతం పలికి, ఆదివాసీ మర్యాదలతో గద్దెల వద్దకు తీసుకెళ్లారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు. మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం రూ.3.14 కోట్లు విడుదల చేసిందని, ఇంతకుముందు కేంద్రం నుంచి జాతరకు రూ.50 లక్షలు మాత్రమే వచ్చేవని చెప్పారు. ములుగులో రూ.900 కోట్లతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 337 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, తాత్కాలిక భవనంలో ఈ ఏడాది తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు.

జాతరకు యునెస్కో గుర్తింపునకు ప్రయత్నం

జాతరకు జాతీయ హోదా ఎందుకివ్వడం లేదని అడిగిన ఓ ప్రశ్నకు కిషన్‌రెడ్డి బదులిస్తూ.. జాతీయ హోదా విధానం అంటూ దేశంలో ఎక్కడా లేదని అన్నారు. గిరిజన పర్యాటక సర్క్యూట్‌ కింద ములుగుకు రూ.80 కోట్లు ఇచ్చామని, గతంలో మేడారంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం రూ.19 కోట్లు ఇచ్చిందని బదులిచ్చారు. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి 30 ప్రత్యేక రైళ్లను వేశామన్నారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తేవడంలో ఎంతో కృషి చేశామని, మేడారానికి కూడా ‘ఇన్‌టాంజబుల్‌ కల్చరల్‌ హెరిటేజ్‌’ కింద యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ల్‌ో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా.. గత ప్రభుత్వం భూసేకరణ చేయలేదని పేర్కొన్నారు. ప్రస్తుత సర్కారు భూమిని ఇస్తే సత్వరమే విమానాశ్రయం నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ప్రముఖులు జాతరకు వస్తే.. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలుగుతాయని, ఏర్పాట్లు చేయడం అధికారులకు సవాలుగా మారుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు. జాతర నేపథ్యంలో ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారని అన్నారు.

  • సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయంలో గిరిజనులకు 50% రిజర్వేషన్లు కల్పించాలని మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన గురువారం కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి అర్జున్‌ముండాకు లేఖ రాశారు. తెలంగాణలో ఎస్టీలకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటుచేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
  • కేసీఆర్‌ హయాంలో అవినీతిపై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరిపించాలని కోరుతూ రవీంద్రనాయక్‌ గురువారం రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు లేఖ రాశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు