దండకారణ్యంలో తప్పదా రణం?

దండకారణ్యం కేంద్రంగా రణం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. మావోయిస్టు ఉద్యమానికి ఊపిరిగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది.

Updated : 23 Feb 2024 05:08 IST

మావోయిస్టుల డెన్‌లో చకచకా పోలీసు బేస్‌ క్యాంపుల నిర్మాణాలు
కేంద్ర ప్రభుత్వ సహకారంతో దూకుడు పెంచిన ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం
అబూజ్‌మడ్‌లోకి సైతం అడుగుపెట్టిన బలగాలు
కీలక నేత హిడ్మా స్వగ్రామం పువర్తిలోనూ పాగా

చర్ల, న్యూస్‌టుడే: దండకారణ్యం కేంద్రంగా రణం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. మావోయిస్టు ఉద్యమానికి ఊపిరిగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు సమాంతర పాలన సాగించిన ప్రాంతాల్లో కొంతకాలంగా భద్రతా బలగాలు పాగా వేస్తున్నాయి. ఎక్కడికక్కడ బేస్‌ క్యాంపుల ఏర్పాటు ద్వారా మావోయిస్టులపై నిర్బంధం పెంచుతున్నాయి.

ఆపరేషన్‌ హిడ్మా..

మావోయిస్టు కీలక నేత, పీఎల్‌జీఏ మొదటి బెటాలియన్‌ కమాండర్‌ మడవి హిడ్మా సొంత గ్రామం సుకుమా జిల్లా పువర్తిలో భద్రతా బలగాలు ఈనెల 16న కొత్త బేస్‌ క్యాంపు ఏర్పాటుచేశాయి. 40 ఏళ్ల తర్వాత ఇక్కడ జాతీయ జెండా ఎగిరింది. మావోయిస్టుల కార్యస్థానంగా పేరొందిన పువర్తిని బలగాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. వేల మంది పువర్తి చుట్టుపక్కల అడవుల్లో జల్లెడపడుతున్నారు. వందల మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న హిడ్మా కోసం బలగాలు వేటాడుతున్నాయి. చుట్టుపక్కల కీకారణ్య గ్రామాల్లోనూ మరిన్ని బేస్‌ క్యాంపుల ఏర్పాటుతో మావోయిస్టుల ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా కొలువుదీరిన భాజపా ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎక్కడికక్కడ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది. మావోయిస్టుల డెన్‌లో బేస్‌ క్యాంపుల నిర్మాణాల్లో వేగం పెంచింది. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టుల సేఫ్‌ జోన్‌ అయిన అబూజ్‌మడ్‌లోకి సైతం బలగాలు అడుగుపెట్టాయి. సుకుమా, బీజాపూర్‌, దంతెవాడ జిల్లాల్లో అబూజ్‌మడ్‌ విస్తరించి ఉంది. కొండలు, గుట్టల్లో దట్టంగా చెట్లు పెరిగి కనీసం నడవటానికీ సరైన దారి లేని ప్రాంతాన్నే అబూజ్‌మడ్‌ అంటారు. మావోయిస్టులు తలదాచుకుంటున్న డెన్‌లపై ఆపరేషన్‌కు వివిధ క్యాడర్లకు చెందిన 3వేల మంది పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి.

తాడోపేడో తేల్చుకునేలా మావోయిస్టుల దూకుడు

కీలక ప్రాంతాల్లోకి బలగాలు అడుగుపెట్టడాన్ని జీర్ణించుకోలేని మావోయిస్టులు సంయుక్త దాడులకు తెగబడేందుకు కార్యాచరణ రూపొందించినట్లు నిఘావర్గాలకు సమాచారమందింది. తాడోపేడో తేల్చుకునేందుకు మావోయిస్టులు కొత్త క్యాంపులపై విరుచుకుపడుతున్నారు. ఎన్నడూ లేనివిధంగా జనవరి 16న బీజాపూర్‌ జిల్లా పామేడు ఠాణా పరిధిలోని పామేడు, చింతవాగు, కొత్తగా నిర్మిస్తున్న ధర్మారం క్యాంపును లక్ష్యంగా చేసుకొని ఏకకాలంలో భీకరదాడులకు తెగబడ్డారు. నిఘావర్గాలు ఊహించని విధంగా గ్రనేడ్‌ లాంఛర్లతో దాడులకు దిగారు. సమర్థంగా తిప్పికొట్టినా ఇలాంటి దాడులు మరిన్ని జరగొచ్చనే నిఘావర్గాల సంకేతాలతో కేంద్ర పారామిలిటరీ బలగాలను అదనంగా మోహరిస్తున్నారు. ఇదే సమయంలో సంయుక్త దాడులకు తెగబడేందుకు ఛత్తీస్‌గఢ్‌తో ఝార్ఖండ్‌, ఒడిశా, ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల మావోయిస్టులు పెద్దసంఖ్యలో దండకారణ్యం చేరుకున్నట్లుగా నిఘా వర్గాలకు సమాచారమందింది. గెరిల్లా యుద్ధానికి తెగబడే మావోయిస్టులపై బలగాలు వ్యూహాత్మక పోరుకు సన్నద్ధమవుతున్నాయి.

పక్కకు మళ్లిన చర్చల అంశం..

చర్చల అంశం పక్కకు మళ్లి దండకారణ్యం రణక్షేత్రంగా మారటంతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు భీతిల్లుతున్నారు. ప్రభుత్వంతో మావోయిస్టుల చర్చల అంశం ఇంతక్రితం తెరపైకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌ ఉప ముఖ్యమంత్రి విజయశర్మ ప్రతిపాదించిన వర్చువల్‌ చర్చల అంశంపై దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ లేఖ విడుదల చేసింది. కొత్త క్యాంపుల నిర్మాణాలు, ఆరు నెలల వరకు సాయుధదళాల కూంబింగ్‌ ఆపాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనే తమ డిమాండ్లను అమలుపరచాలని కోరింది. ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని