‘టీజీ’పై నేడో, రేపో నోటిఫికేషన్‌

కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్‌ కోడ్‌ మారనుంది. ప్రస్తుతం ‘టీఎస్‌’ కోడ్‌తో రిజిస్ట్రేషన్‌ చేస్తుండగా ఇక ‘టీజీ’గా మారనుంది.

Published : 24 Feb 2024 03:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్‌ కోడ్‌ మారనుంది. ప్రస్తుతం ‘టీఎస్‌’ కోడ్‌తో రిజిస్ట్రేషన్‌ చేస్తుండగా ఇక ‘టీజీ’గా మారనుంది. ఈ మేరకు కేంద్రం నేడో, రేపో గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆ వెంటనే రాష్ట్ర రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అనంతరం కొత్త కోడ్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం టీఎస్‌ కోడ్‌ను టీజీగా మార్చాలని నిర్ణయించింది. కేంద్రానికి ఈ నెల 5న లేఖ రాసింది. రవాణాశాఖ సంయుక్త కమిషనర్‌ పాండురంగనాయక్‌ దిల్లీ వెళ్లి ఉన్నతాధికారులను కలవగా ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మార్పు కొత్త వాహనాలకే అమలుచేయాలనీ, పాత వాహనాలకు గతరిజిస్ట్రేషన్‌ కోడ్‌ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 1.64 కోట్ల వరకు వాహనాలు ఉన్నాయి. ఇందులో ద్విచక్ర వాహనాలు 73.8 శాతం ఉండగా, కార్లు 13 శాతం ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని