నగదు బదిలీనే

మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్‌ రాయితీ లబ్ధిదారులకు ‘నగదు బదిలీ’ విధానాన్నే అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ తాజాగా నిర్ణయించింది.

Updated : 24 Feb 2024 06:48 IST

గ్యాస్‌ రాయితీ విషయంలో మారిన పౌరసరఫరాల శాఖ నిర్ణయం
సిలిండర్‌ మొత్తం ధర చెల్లించాలి
తర్వాత వినియోగదారుడి ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ

ఈనాడు, హైదరాబాద్‌: మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్‌ రాయితీ లబ్ధిదారులకు ‘నగదు బదిలీ’ విధానాన్నే అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ తాజాగా నిర్ణయించింది. ఈ విధానం ప్రకారం లబ్ధిదారులు గ్యాస్‌ సిలిండర్‌ తీసుకునేటప్పుడు మొత్తం ధర చెల్లించాలి. ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.955గా ఉంది. మహాలక్ష్మి పథకంలో అర్హులకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మిగతా మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో బదిలీ చేయాలని నిర్ణయించింది. తాజా నిర్ణయానికి సంబంధించిన విధివిధానాల్ని పౌరసరఫరాల శాఖ రూపొందించింది. ఆ వివరాలివీ..

వాడకంలో ఉన్న సిలిండర్లకే రాయితీ

  •  కొత్తగా తీసుకునే గ్యాస్‌ కనెక్షన్లకు రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకం వర్తించదు. పాత కనెక్షన్లలో ఆహారభద్రత కార్డులున్నవారికీ.. అది కూడా వాడకంలో ఉన్న సిలిండర్లకే రాష్ట్ర ప్రభుత్వ గ్యాస్‌ సబ్సిడీ వర్తింపు.
  • గృహ వినియోగదారుడు గడిచిన మూడేళ్లలో వాడిన సిలిండర్ల సగటు ఆధారంగా రాయితీ సిలిండర్ల సంఖ్య ఖరారు.
  • ప్రస్తుతానికి దాదాపు 40 లక్షల మహిళా లబ్ధిదారుల గుర్తింపు. ఈ సంఖ్యతో పథకం ప్రారంభం.
  • రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించే రాయితీ చెల్లింపులకు ఎన్‌పీసీఐ(నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ప్లాట్‌ఫాంగా పనిచేస్తుంది. ఎస్‌బీఐ నోడల్‌ బ్యాంకుగా వ్యవహరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అప్‌ఫ్రంట్‌ ఎమౌంట్‌ బ్యాంకులో ఉంటుంది. రాయితీ సిలిండర్లు సరఫరా చేశాక ఎన్‌పీసీఐ నోడల్‌ బ్యాంకులో ఉన్న సొమ్ము నుంచి లబ్ధిదారుల ఖాతాలకు నిర్ణీత సబ్సిడీని బదిలీ చేస్తుంది.

సాంకేతిక ఇబ్బందుల కారణంగానే!

గ్యాస్‌ ఏజెన్సీల ప్రతినిధులతో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సమావేశం నిర్వహించారు. రూ.500కే వినియోగదారులకు సిలిండర్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన ఏజెన్సీల ప్రతినిధులు ఆయిల్‌ కంపెనీల నిబంధనలు కూడా అనుమతించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఆర్థికపరమైన అంశాలు ఉండటం.. దాదాపు 800 మంది గ్యాస్‌ డీలర్లు, వారి పరిధిలో వేలాది మంది డెలివరీ బాయ్స్‌ ఉండటం వంటి అంశాలపై పౌరసరఫరాల శాఖ శుక్రవారం సమీక్షించింది. గ్యాస్‌ ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్‌లో కొందరు అవకతవకలకు పాల్పడే అవకాశాలు ఉండటం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. గ్యాస్‌ డీలర్లకు ఆయిల్‌ కంపెనీలు.. వారికి కేంద్ర పెట్రోలియం శాఖ అనుమతులు వంటి సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకున్న పౌరసరఫరాల శాఖ తన నిర్ణయాన్ని మార్చుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని