27 నుంచి మరో రెండు గ్యారంటీలు

ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో రెండింటికి ఈ నెల 27వ తేదీ సాయంత్రం శ్రీకారం చుట్టబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.

Updated : 24 Feb 2024 06:22 IST

ప్రియాంకాగాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి గ్యాస్‌, కరెంటు పథకాలు ప్రారంభిస్తాం
సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో విజయం సాధించాం
మేడారం జాతరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
కేంద్రం దక్షిణాదిపై వివక్ష చూపడం మంచిది కాదని వ్యాఖ్య

ఈనాడు, వరంగల్‌: ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో రెండింటికి ఈ నెల 27వ తేదీ సాయంత్రం శ్రీకారం చుట్టబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి రూ.500కే సిలిండర్‌తో పాటు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో అరాచకాన్ని, దోపిడీని ఎదుర్కొని విజయం సాధించామన్నారు. శుక్రవారం మేడారం జాతరకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రులు సీతక్క, కొండాసురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, సలహాదారు వేం నరేందర్‌రెడ్డిలతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు...

‘‘ప్రజలను పీడించి పన్నులు వసూలు చేయాలనుకున్న రాజులపై ఆదివాసీ తల్లీబిడ్డలు పోరాడి అమరులయ్యారు. కాబట్టే వందల సంవత్సరాలైనా సమ్మక్కసారలమ్మలను దేవతలుగా కొలుస్తున్నాం. గతేడాది ఫిబ్రవరి 6న మేడారం నుంచే జోడో యాత్ర ప్రారంభించి విజయం సాధించాం. ఆ పోరాటస్ఫూర్తిని సమ్మక్క సారలమ్మల నుంచే పొందాం. ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలు పరిష్కరించేందుకు మేం కృషి చేస్తాం. ఇప్పటికిప్పుడు అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని నేను అనను... కానీ ప్రభుత్వం తమ సమస్యలు వింటుందనే నమ్మకాన్ని మాత్రం ఈ 75 రోజుల్లో ప్రజలకు కల్పించాం. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేస్తున్నాం. ఈ నెల 27న మరో రెండు గ్యారంటీలను ప్రారంభిస్తాం. ప్రియాంకాగాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి వీటికి శ్రీకారం చుడతాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 25వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ఆయన వివరించారు. ‘‘స్టాఫ్‌ నర్సులు, సింగరేణి ఉద్యోగులు, పోలీసు, ఆబ్కారీశాఖ, అగ్నిమాపక శాఖల్లో ఉద్యోగాలు నింపాం. మార్చి 2న మరో 6వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం. 25 వేల కొలువులను నింపి ఎల్‌బీ స్టేడియంలో ప్రజల ముందే నియామక పత్రాలు అందజేశాం. గతంలో ఉద్యోగాలు ఇవ్వకున్నా ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్న మామా అల్లుళ్లు, తండ్రీ కొడుకులు ఇప్పుడు మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని సీఎం విమర్శించారు. 65 ఐటీఐలను నైపుణ్య కేంద్రాలుగా మార్చి గ్రామీణ ప్రాంతాల్లో యువత నైపుణ్యాలను పెంపొందిస్తామన్నారు.

కేసీఆర్‌ అవినీతిని మోదీ పట్టించుకోలేదు

‘‘సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలు, నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే మేడిపండులా తయారైందని స్పష్టమైంది. ఏపీ ప్రభుత్వం కృష్ణానది జలాలను తరలించుకుపోతుంటే గత ప్రభుత్వం కళ్లప్పగించి చూసింది. విద్యుత్తు విషయంలో కూడా జరిగిన తప్పులను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజలకు వివరించారు. గతంలో ఎప్పుడూ జరగనంత దోపిడీ ఈ పదేళ్లలో జరిగింది. అలా జరుగుతున్నప్పుడు మోదీ ప్రభుత్వం కళ్లు మూసుకుంది. ప్రతిపక్షంలో మేం ఉన్నప్పుడు ఎన్ని ఫిర్యాదులు చేసినా కేసీఆర్‌ అవినీతిని పట్టించుకోలేదు. ఇప్పుడు మేం న్యాయ విచారణ చేపట్టేందుకు సిద్ధమయ్యాక సీబీఐ విచారణను మా ప్రభుత్వం కోరాలని కేంద్రం అంటోంది. కేసీఆర్‌ దోపిడీలో వాటా కోసమే సీబీఐ విచారణ అంటున్నారు, చర్యలు తీసుకోవడానికి కాదు. అందుకే మేం త్వరలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో చేపట్టే విచారణను భారాస నేతలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని సీఎం అన్నారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకునేందుకు భారాస, భాజపా చీకటి ఒప్పందం కుదుర్చుకుంటున్నాయని ఆరోపించారు. త్వరలో రైతులకిచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీ అమలు చేసేందుకు బ్యాంకులను సంప్రదిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘గతంలో ప్రభుత్వ పోస్టింగ్‌లలో కమీషన్లు తీసుకునేవారు. ఇప్పుడు పనితీరును చూసి పోస్టింగ్‌లు ఇస్తున్నాం. గతంలో సర్కారు ఉద్యోగులకు నెలాఖరులో కూడా జీతాలు వచ్చేవి కావు. ఇప్పుడు ఒకటో తేదీనే జీతాలు ఖాతాల్లో జమచేస్తున్నాం. ఇంకా పాలన గాడిన పడాల్సి ఉంది. అందుకే సెలవులు లేకుండా అహర్నిశలు పనిచేస్తున్నారు. గతంలో సచివాలయంలోకి విపక్షాలకు, మీడియాను లోనికి రానిచ్చేవారు కాదు. ఇప్పుడు తెలంగాణకు కాంగ్రెస్‌ స్వేచ్ఛనిచ్చింది’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ అన్నారు.

కిషన్‌రెడ్డి ఆదివాసీలను అవమానపరిచారు

మేడారం ప్రాంతాన్ని ఆదివాసీల ఆచారాలకు అనుగుణంగా వారి అనుమతితో అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించారు. ఈసారి రాష్ట్రప్రభుత్వం రూ.110 కోట్లను విడుదల చేసిందని..పర్యవేక్షణ కోసం సీతక్క నేతృత్వంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లతో బృందాన్ని ఏర్పాటుచేశామని వివరించారు. ‘‘ఆరు వేల బస్సులను వేశాం. దక్షిణ భారత కుంభమేళాగా పేరుగాంచిన ఈ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. కానీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కుదరదని మాట్లాడారు. ఉత్తరభారత దేశంలో జరిగే కుంభమేళాకు రూ.వందల కోట్లు ఇచ్చే కేంద్రం సమ్మక్క జాతరకు కేవలం రూ.3 కోట్లు ఇచ్చి సరిపెట్టింది. ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను జాతరకు మేం అధికారికంగా ఆహ్వానిస్తున్నాం. మీరు అయోధ్యను సందర్శించాలని పిలుపునిస్తే మేమంతా వెళ్లి రాముడిని దర్శించుకుంటున్నాం. కేంద్రం దక్షిణాదిపై వివక్ష చూపడం మంచిది కాదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జాతీయ హోదా ఇవ్వబోమని ఆదివాసీ బిడ్డలను అవమానిస్తూ మాట్లాడడం సరికాదు’’ అన్నారు. రాష్ట్ర పండగగా గుర్తించాలని అప్పట్లో సీతక్క అప్పటి సీఎం చంద్రబాబును కోరితే ఆయన జాతరను రాష్ట్ర పండగగా గుర్తించిన విషయాన్ని గుర్తుచేశారు. 

సమ్మక్క సారలమ్మలను శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితోపాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, భాజపా నేత ఈటల రాజేందర్‌ తదితరులు మొక్కులు చెల్లించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని