సిరిసిల్ల విద్యుత్‌ సొసైటీ రద్దు!

రాజన్న సిరిసిల్ల జిల్లా వాసుల కోసం ప్రత్యేకంగా ఉన్న సహకార విద్యుత్‌ సరఫరా సంస్థ (సెస్‌)ను మూసివేసి ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లో కలిపివేయాలంటూ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) శుక్రవారం సంచలన ఉత్తర్వులు జారీచేసింది.

Updated : 24 Feb 2024 06:21 IST

ఆడిట్‌లో బయటపడిన అక్రమాలు
రూ.558 కోట్ల బకాయిలు, రూ.94.88 కోట్ల అవినీతి
‘సెస్‌’ను మూసివేసి డిస్కంలో కలిపేయాలని ఈఆర్‌సీ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా వాసుల కోసం ప్రత్యేకంగా ఉన్న సహకార విద్యుత్‌ సరఫరా సంస్థ (సెస్‌)ను మూసివేసి ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లో కలిపివేయాలంటూ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) శుక్రవారం సంచలన ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలోని చేనేత పరిశ్రమల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న సెస్‌ అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందని విస్పష్టంగా పేర్కొంది. ఈఆర్‌సీ ఉత్తర్వుల ప్రకారం.. సెస్‌ పరిధిలో కరెంటును రాయితీపై తీసుకుని ‘బోగస్‌ కనెక్షన్లతో’ వినియోగిస్తున్నారు. ఒక కేటగిరీలో కనెక్షన్‌ తీసుకుని మరో కేటగిరీలో కరెంటు వాడుకోవడం వల్ల ఈ సంస్థకు విద్యుత్‌ సరఫరాచేస్తున్న ఉత్తర డిస్కంకు నష్టాలు వస్తున్నాయి. వీటితో సహా మొత్తం రూ.94.88 కోట్ల అవినీతి జరిగినట్లు ఆడిట్‌లో గుర్తించారు. పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకు నిర్దేశించిన హైటెన్షన్‌(హెచ్‌టీ) కేటగిరీలో కరెంటు వాడుకుంటూ బిల్లులు మాత్రం గృహావసరాలు వంటివాటికి వినియోగించే లోటెన్షన్‌(ఎల్‌టీ) పేరుతో తక్కువగా చెల్లించడం వల్ల రూ.23.77 కోట్లు, పలు కనెక్షన్లను ఒకే పేరుతో వాడుకోవడం వల్ల మరో రూ.22.16 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇలా మొత్తం 12 అంశాల్లో రూ.94.88 కోట్ల ఆదాయానికి గండిపడింది. ఎల్‌టీ కనెక్షన్లను ఇతర అవసరాలకు వాడుకునేందుకు ఇవ్వవద్దని గతంలో ఈఆర్‌సీ డిస్కంలకు పలు ఉత్తర్వులు జారీచేసింది. అయినా ఎల్‌టీ పేరుతో కనెక్షన్లను ఇచ్చి ఆదాయానికి కొందరు అధికారులు గండికొట్టారు. ఇలా అక్రమాలకు పాల్పడిన అధికారుల జాబితాను సైతం సేకరించినట్లు ఈఆర్‌సీ తెలిపింది.

స్టోర్‌ మునిగి భారీ నష్టం..

భారీగా విద్యుత్‌ వ్యాపారం చేస్తున్న సొసైటీ సామగ్రి నిల్వ ఉంచే స్టోర్‌కు కనీసం బీమా చేయించలేదు. దీనివల్ల 2018-19లో వచ్చిన వరదలకు స్టోర్‌ మునిగి భారీ నష్టం వాటిల్లింది. గత ఏడాదికాలంగా వ్యర్థాల సామగ్రినీ విక్రయించలేదు. ఈ సొసైటీ పరిధిలోని వినియోగదారులకు సరఫరా చేసేందుకు కరెంటును ఉత్తర డిస్కం నుంచి సెస్‌ కొంటుంది. ఇలా కొన్న కరెంటుకు ఉత్తర డిస్కంకు రూ.558.44 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. చేనేత పరిశ్రమకు వాడుకునే కరెంటుకు రాష్ట్ర ప్రభుత్వం ఛార్జీల్లో రాయితీ కింద ఇవ్వాల్సిన నిధులు కూడా విడుదల చేయడం లేదు.

ఆడిట్‌తో బయటపడిన లొసుగులు..

2019-2022 మధ్యకాలంలో సెస్‌ ఆదాయ, వ్యయాలపై ఈఆర్‌సీ ఆడిట్‌ చేయించగా పలు లొసుగులు, నిధుల దుర్వినియోగం వంటివి బయటపడ్డాయి. ఆదాయానికి గండిపడే చర్యలను అరికట్టాలని, కరెంటు బిల్లులను పక్కాగా జారీ చేయాలని ఇందుకోసం ఉత్తర డిస్కం వినియోగిస్తున్న కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌తో ఆడిట్‌ చేయాలని ఈఆర్‌సీ ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర డిస్కం ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేసి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో మరిన్ని నష్టాలు జరగకుండా, ఆదాయాన్ని కోల్పోకుండా ఉండాలంటే సెస్‌ను మూసేసి అక్కడ విద్యుత్‌ సరఫరా వ్యవస్థనంతా ఉత్తర డిస్కంలో కలిపేయాలని ఈఆర్‌సీ ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. విద్యుత్‌ చట్టం-2023లోని సెక్షన్‌ 86(2) కింద ఈ సలహా ఇస్తున్నట్లు స్పష్టంచేసింది.

అవినీతిని ప్రజలే చెప్పారు..

సెస్‌లో అవినీతి, అక్రమాలను ప్రజలే మండలి దృష్టికి తెచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని(2023-24)కి సంబంధించిన కరెంటు ఛార్జీల ఉత్తర్వులపై సిరిసిల్లలో 2023 ఫిబ్రవరి 20న ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ నిర్వహించింది. 2022 నవంబరు 1న కూడా ప్రజలకు కరెంటు వినియోగంపై మండలి అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ రెండు సందర్భాల్లో పలువురు వినియోగదారులే సెస్‌లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. సెస్‌ ఆదాయ, వ్యయాలపై రాష్ట్ర సహకార శాఖ ఆడిటర్లు ఏటా చేస్తున్న ఆడిట్‌ పక్కాగా లేనందున అక్రమాలు బయటికి రావడం లేదని ఈఆర్‌సీ గుర్తించింది. ఈ నేపథ్యంలో 2019-22 మధ్యకాలంలో సెస్‌ వ్యాపార కార్యకలాపాలపై పక్కాగా ఆడిట్‌ చేయించుకునేందుకు డిస్కంల నుంచి ఆడిటర్ల జాబితాను ఈఆర్‌సీ తీసుకుంది. వీటిలో ఒక ఆడిట్‌ సంస్థను ఎంపిక చేసి వేములవాడ, తంగళ్లపల్లి, గంభీరావుపేట విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయాలకు సంబంధించి ప్రయోగాత్మకంగా జరిపిన ఆడిట్‌లో పలు లొసుగులు బయటపడ్డాయి. దీంతో మరింత లోతుగా సొసైటీ మొత్తం ఆదాయ, వ్యయాలపై ఆడిట్‌ చేయిస్తే మరిన్ని అక్రమాలు వెలుగుచూసినట్లు ఈఆర్‌సీ ఛైర్మన్‌ శ్రీరంగారావు ‘ఈనాడు’కు చెప్పారు. ఈ సొసైటీ వల్ల తీవ్రనష్టం వస్తోందని, ఉత్తర డిస్కంలో కలిపేస్తే ఆదాయం పెరుగుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని