‘కొడంగల్‌ కళాశాల’.. కొలిక్కి తెచ్చేనా?

రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో పోస్టుల భర్తీ ఆలస్యమవుతుండడం సమస్యాత్మకంగా మారింది. దీనివల్ల ఇప్పటికే వరంగల్‌ జిల్లా మామునూరు, సిద్దిపేటలోని పశువైద్య కళాశాలల గుర్తింపు రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది.

Published : 24 Feb 2024 03:04 IST

పశువైద్య కళాశాలల్లో ఇప్పటికే భారీగా ఖాళీలు
కొత్త కాలేజీతోపాటు పాత వాటికీ నియామకాలు అవసరం
గత ఏడాది నాటి భర్తీ ప్రక్రియ పెండింగ్‌లో..
సీఎం రేవంత్‌పైనే విద్యార్థుల ఆశలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో పోస్టుల భర్తీ ఆలస్యమవుతుండడం సమస్యాత్మకంగా మారింది. దీనివల్ల ఇప్పటికే వరంగల్‌ జిల్లా మామునూరు, సిద్దిపేటలోని పశువైద్య కళాశాలల గుర్తింపు రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు కొత్త పశువైద్య కళాశాల మంజూరు కావడం, బుధవారం ఆయన శంకుస్థాపన చేయడంతో.. ఇతర కళాశాలల సమస్యలపైనా దృష్టి సారిస్తారని విద్యార్థులు ఆశిస్తున్నారు. కొత్త కళాశాలతో కలిపి రాష్ట్రంలో సుమారు 180 బోధన, 500 బోధనేతర పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. పశుసంవర్ధకశాఖ ప్రస్తుతం సీఎం వద్దనే ఉండడంతో నియామకాలకు ఆయన చొరవ చూపాలని విద్యార్థులు కోరుతున్నారు.

సమస్యలతో...

పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం రాజేంద్రనగర్‌, కోరుట్ల, మామునూరు, సిద్దిపేటల్లో కళాశాలలున్నాయి. ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు సహా పలు పోస్టులు ఖాళీగా ఉండడంతో కళాశాలలు సరిగా నడవడం లేదు. జాతీయ పశువైద్య మండలి (వీసీఐ), జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌) తనిఖీల్లో.. పోస్టుల కొరత ఉందని తేలితే గుర్తింపు (రికగ్నిషన్‌) ఇవ్వడం లేదు. గతంలో మామునూరు కళాశాలలో ఇదే సమస్య రావడంతో ప్రవేశాలు నిలిపివేసి.. ఉన్న విద్యార్థులను రాజేంద్రనగర్‌, కోరుట్ల కళాశాలలకు మార్చారు. ఈసారి తనిఖీలు జరిగితే.. గుర్తింపు రద్దు వంటి చర్యలు తీసుకునే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. బోధన సిబ్బంది కొరత వల్ల సిద్దిపేటలో ప్రవేశాలు కల్పించలేదు. కోరుట్ల, రాజేంద్రనగర్‌లోనూ ఖాళీలున్నాయి.


105 పోస్టులకు అనుమతిచ్చినా...

త జూన్‌లో అప్పటి భారాస ప్రభుత్వం 105 మంది బోధన సిబ్బంది నియామకాలకు అనుమతించింది. భర్తీ ప్రక్రియ గత డిసెంబరులో మొదలైంది. ఎంపిక పూర్తయినా.. అనంతరం వివాదం వల్ల నియామకాలు నిలిచిపోయాయి. పూర్తిస్థాయి వీసీ లేకపోవడం వల్ల నియామకాలకు అధికారులు చొరవ చూపడం లేదు. ప్రభుత్వం అన్ని విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకాలకు నోటిఫికేషన్‌ ఇచ్చినా పశువైద్య విశ్వవిద్యాలయానికి ఇవ్వలేదు. తాజాగా కొడంగల్‌లో కొత్త పశువైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి రూ. 360 కోట్లు మంజూరు చేసింది. దీనికి 18 మంది ప్రొఫెసర్లు, 18 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 44 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, మరో 125 మంది పొరుగు సేవల సిబ్బంది పోస్టులను కేటాయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమయ్యే ఈ కాలేజీకి సిబ్బంది నియామకాలు చేపట్టాల్సి ఉంది. దీంతో పాటు మిగిలిన ఖాళీలూ భర్తీ అవుతాయని విశ్వవిద్యాలయ వర్గాలు ఆశిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని