భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి

రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన భూ సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించింది. వీలైనంత త్వరగా వాటికి పరిష్కారం చూపేందుకు కార్యాచరణ ప్రారంభించింది.

Published : 24 Feb 2024 03:07 IST

నేడు ధరణి కమిటీతో ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన భూ సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించింది. వీలైనంత త్వరగా వాటికి పరిష్కారం చూపేందుకు కార్యాచరణ ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం పెండింగ్‌ సమస్యలపై సమీక్ష చేపట్టనున్నారు. ధరణి పోర్టల్‌కు సంబంధించి దాదాపు రెండున్నర లక్షలకుపైగా అపరిష్కృత ఫిర్యాదులున్నాయి. ఇవన్నీ జిల్లా కలెక్టర్ల వద్ద పేరుకుపోయాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి కూడా పెద్దఎత్తున అర్జీలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కలెక్టర్లతో ధరణి కమిటీ నిర్వహించాల్సిన కాన్ఫరెన్స్‌ రద్దు అయ్యింది.

రెండు భాగాలుగా సమస్యలు

భూ సమస్యలను రెండు భాగాలుగా చూడనున్నారు. మొదట సులువుగా పరిష్కారమయ్యేవి. ఇందులో భాగంగా పెండింగ్‌లో ఉన్న వాటిపై ముందుగా చర్యలు చేపట్టనున్నారు. రెండోది శాశ్వత భూ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు. దీనిలో భాగంగా ధరణిలో పూర్తిస్థాయిలో మార్పులు తేవడం, రెవెన్యూ పరిపాలనలో సంస్కరణలు, సమగ్ర సర్వే తదితర చర్యలు చేపట్టనున్నారు. భూ సమస్యలపై సలహాలకు, ధరణి పునర్నిర్మాణంపై తీసుకోవాల్సిన చర్యలపై కోదండరెడ్డి, భూమి సునీల్‌, రేమండ్‌పీటర్‌ తదితరులతో ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ ఇప్పటికే కొంత కసరత్తు చేసింది. సీఎం సమీక్ష నేపథ్యంలో కమిటీ ప్రాథమికంగా ఒక నివేదికను అందించనుంది.

క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఇవే.. సీఎంసారూ!

జిల్లా కలెక్టరేట్లు, హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణికి (గ్రీవెన్స్‌) వస్తున్న ఎక్కువ సమస్యల్లో హక్కుల జారీకి సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి నుంచి విచారణ నివేదికలను వెంటనే తెప్పించుకుని పరిష్కరించగలిగేవే ఎక్కువగా ఉన్నాయి. కలెక్టర్ల బిజీ షెడ్యూలు, తహసీల్దారు కార్యాలయాల నుంచి విచారణ నివేదికలు సకాలంలో రాకపోవడం లాంటి లోపాలున్నాయి. దరఖాస్తుల్లో లేదా విచారణ సందర్భంగా ఏ చిన్న సమాచారం లభించకపోయినా వాటిని తిరస్కరిస్తున్నారు. దీంతో సమస్యలు పెండింగ్‌లో పడిపోతున్నాయి. అలాంటి సమస్యల్లో కొన్ని..

  • అచ్చు, పేర్లు తప్పుగా ఉన్నవి
  • సాగులో ఉన్నప్పటికీ మిస్సింగ్‌ సర్వే నంబర్లుగా చూపుతున్న భూములు
  • ఇనాం భూములకు హక్కులు జారీ (ఓఆర్సీ జారీ అయినవి)
  • భూమి రకం (క్లాసిఫికేషన్‌) తప్పుగా నమోదైనవి
  • సాగులోనే ఉన్నా.. సగం విస్తీర్ణాలే పాసుపుస్తకాల్లో నమోదు చేసినవి
  • అటవీ-రెవెన్యూ సరిహద్దు సమస్యతో నిలిచిపోయిన పట్టాల జారీ

భారంగా దరఖాస్తు రుసుం.. 

ధరణి సమస్యలపై మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసిన ప్రతిసారి రూ.1200 వరకు రైతులు చెల్లించాల్సి వస్తోంది. డాక్యుమెంట్ల స్కానింగ్‌ ధరలు అదనం. సమస్యలు పరిష్కారం కాకపోవడం, అర్జీలు తిరస్కరణకు గురైనప్పుడల్లా తిరిగి దరఖాస్తు చేయడానికి రైతులు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. దీనిపై సీఎం దృష్టిసారించి వ్యయప్రయాసలు లేని విధానాన్ని తీసుకురావాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతోపాటు దరఖాస్తు అందిన నిర్దిష్ట సమయంలో పరిష్కారం చూపేలా పౌర నియమావళిని (సిటిజన్‌ ఛార్ట్‌) అమలు చేయాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు