కులగణన జరిగితే బీసీ సబ్‌ప్లాన్‌: భట్టి

రాష్ట్రంలో బీసీ కుల గణన పూర్తయిన తరువాత బీసీ సబ్‌ప్లాన్‌ సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

Published : 24 Feb 2024 03:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీసీ కుల గణన పూర్తయిన తరువాత బీసీ సబ్‌ప్లాన్‌ సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దేశంలో ధనికులు, పేదల మధ్య అంతరాలు తొలగిపోవాలంటే కుల గణన జరగాల్సిందేనని స్పష్టం చేశారు. కులగణన తీర్మానంపై విపక్షంలోని కొందరు తప్పుదోవ పట్టించాలని కుట్రపూరిత విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ సచివాలయంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, బీసీ మేధావులు, అధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. కులగణనకు సంబంధించి వివిధ రాష్ట్రాలతో పాటు బిహార్‌లో ఎలాంటి న్యాయచిక్కులు లేకుండా జరిగిన సర్వే, చట్టం తదితర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ‘‘కులగణనపై మంత్రివర్గంలో తీర్మానం చేసి, అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించాం. ఈ తీర్మానం చారిత్రాత్మకం. బీసీల కులగణన తీర్మానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా బీసీ మేధావులు తీసుకెళ్లాలి.’’ అని డిప్యూటీ సీఎం తెలిపారు. కులగణనపై ప్రభుత్వం నిజాయతీగా ఉందని, మంత్రి మండలిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా తీర్మానం చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌, ప్రొఫెసర్‌ మురళీధర్‌, ప్రొఫెసర్‌ సింహాద్రి, బీసీ నాయకుడు క్రాంతికుమార్‌, ఆకునూరి మురళి, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు.

పునరుద్ధరణ ఇంధన ఉత్పత్తి పెంపుపై ప్రత్యేక దృష్టి

మారుతున్న కాలమాన పరిస్థితుల దృష్ట్యా సౌర, పవన విద్యుత్‌ వంటి పునరుద్ధరణ ఇంధన ఉత్పత్తి పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రజాభవన్‌లో టీఎస్‌ రెడ్కో పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బహిరంగ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, జలాశాయాలను గుర్తించి సౌరవిద్యుదుత్పత్తికి అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని చెప్పారు. మన ఊరు-మనబడి పథకం కింద ఏర్పాటు చేసిన సోలార్‌ రూఫ్‌ టాప్‌ పనితీరు గురించి ఆరా తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని