త్వరలో మెట్రో నూతన మార్గాలకు శంకుస్థాపన

హైదరాబాద్‌ నగరంలో మెట్రోరైలు కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల దస్త్రాలు కనిపించడం లేదని, అనుమతులు ఆన్‌లైన్లో సక్రమంగా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 24 Feb 2024 03:10 IST

15 రోజుల్లో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీల్లో విజిలెన్స్‌ సోదాలు
డ్రోన్‌ కెమెరాలతో ఆస్తిపన్ను మదింపు: సీఎం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో మెట్రోరైలు కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల దస్త్రాలు కనిపించడం లేదని, అనుమతులు ఆన్‌లైన్లో సక్రమంగా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి అధికారులు ఇష్టానుసారం అనుమతులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. 15 రోజుల్లో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీల్లో విజిలెన్స్‌ సోదాలు జరుగుతాయని, ఇష్టానుసారం వ్యవహరించిన అధికారులందరూ ఇంటికి వెళ్లాల్సిందేనని చెప్పారు. శుక్రవారమిక్కడ హెచ్‌ఎండీఏ కార్యాలయంలో వాటర్‌వర్క్స్‌, పురపాలక, జీహెచ్‌ఎంసీపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆన్‌లైన్లో లేకుండా ఇచ్చిన అనుమతుల జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గ్రూప్‌-1 అధికారులు కమిషనర్లుగా ఉండాలని స్పష్టం చేశారు. కొత్త కార్పొరేషన్లకు ఐఏఎస్‌ అధికారుల్ని కమిషనర్లుగా నియమించాలన్నారు. హైదరాబాద్‌లో విలువైన ప్రభుత్వ ఆస్తుల జాబితాను సిద్ధం చేసి, ప్రభుత్వానికి అందజేయాలన్నారు.

కాలనీల్లో తిరగని జోనల్‌ కమిషనర్లు ఇంటికి వెళ్లిపోవచ్చు..

‘‘హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌ నుంచి చెరువుల సమాచారం ఎందుకు డిలీట్‌ అవుతోంది? హెచ్‌ఎండీఏ పరిధిలోని 3,500 చెరువుల సమాచారం ఆన్‌లైన్‌లో ఉండాల్సిందే. చెరువుల ఆక్రమణలకు గురికాకుండా వాటివద్ద తక్షణమే సీసీ కెమెరాలు పెట్టాలి. హైదరాబాద్‌లో పిల్లల కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి. మున్సిపాలిటీల్లో వర్కర్లకు ప్రమాద బీమా కల్పించే విషయమై అధ్యయనం చేయాలి. జీహెచ్‌ఎంసీలో వయసుపైబడిన కార్మికుల స్థానంలో కుటుంబ సభ్యులకు అవకాశమివ్వాలి. ఆస్తిపన్ను మదింపు కోసం డ్రోన్‌కెమెరాలు ఉపయోగించాలి. జోనల్‌ కమిషనర్లు ఉదయాన్నే కాలనీల్లో పర్యటించాలి. ఇష్టం లేని అధికారులు ఇంటికి వెళ్లిపోవచ్చు. కావాలంటే కుర్చీలోనే కూర్చునే పోస్టులిస్తాం. హైదరాబాద్‌లో న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌ తరహాలో వీడియో ప్రకటనల బోర్డు, మల్టీ యుటిలిటీ టవర్స్‌ ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌ నగరానికి తాగునీటి కొరత లేకుండా చూడాలి. అవసరమైతే స్థానిక చెరువుల్ని స్టోరేజీ ట్యాంకులుగా ఉపయోగించండి. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ, రంగనాయక సాగర్‌ నుంచి హైదరాబాద్‌కు తాగునీరు సరఫరా అయ్యేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలి. వచ్చే 50 ఏళ్లనాటి అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాకు కార్యాచరణ రూపొందించాలి’’ అని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు దాన కిశోర్‌, ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని