నీటి ఊట లేక ఎండుతున్న తోట

బోర్లలో నీరు అడుగంటడంతో ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పండ్ల తోటలను రక్షించుకోవడానికి రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

Published : 24 Feb 2024 03:14 IST

నల్గొండ జిల్లాలో పండ్ల తోటలను కాపాడుకోవడానికి రైతుల కష్టాలు

ఈనాడు, నల్గొండ: బోర్లలో నీరు అడుగంటడంతో ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పండ్ల తోటలను రక్షించుకోవడానికి రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రూ.లక్షలు ఖర్చు చేసి కొత్తగా బోర్లు వేసినా చుక్క నీరు పడటం లేదని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. చాలా ప్రాంతాల్లో తోటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే బత్తాయి సుమారు 60 వేల ఎకరాల్లో, నిమ్మ 12 వేల ఎకరాల్లో ఉన్నాయి. ఈ జిల్లాలో గత ఏడాది జనవరిలో భూగర్భ జలాలు 5.27 మీటర్ల లోతున ఉంటే ఈ సంవత్సరం జనవరిలో 9.68 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. 2016లో గరిష్ఠంగా 10 మీటర్లకుపైగా లోతుకు పడిపోగా ఆ తర్వాత అంతగా తగ్గడం ఇప్పుడే. ఈ ఏడాది నల్గొండ జిల్లాలో 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కృష్ణా పరీవాహకంలో ఎగువ నుంచి వరద లేకపోవడంతో గత ఎనిమిదేళ్లలో తొలిసారి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోలేదు.

మచ్చుకు తంగెళ్లవారిగూడేన్ని చూస్తే...

దాదాపు 250 మంది జనాభా కలిగిన కనగల్‌ మండలం చిన్నమాదారం గ్రామ పంచాయతీ పరిధిలోని తంగెళ్లవారిగూడెంలో సుమారు 700 ఎకరాల వరకు సాగు భూమి ఉంది. ఇందులో సుమారు 450 ఎకరాల వరకు బత్తాయి తోటలనే సాగు చేస్తున్నారు. ఈ నెలన్నర రోజుల్లో 100 మంది వరకు రైతులు 240 దాకా బోర్లు వేశారు. అన్నీ 550 అడుగుల పైమాటే. సుమారు పది బోర్లలో మాత్రమే నీళ్లు పడ్డాయి. బోర్లకే తాము రూ.కోటి వరకు ఖర్చు చేశామని వెంకటయ్య అనే రైతు తెలిపారు. వచ్చే వానాకాలం సీజన్‌ వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని, ఎక్కువ బోర్లు వేసి నష్టపోవద్దని భూగర్భ జల శాఖ నల్గొండ జిల్లా అధికారి సునీల్‌బాబు రైతులకు సూచిస్తున్నారు.


నెల రోజుల్లో 21 బోర్లు

ఈ రైతు పేరు తంగెళ్ల వెంకట్‌రెడ్డి. స్వస్థలం నల్గొండ జిల్లా కనగల్‌ మండలంలోని తంగెళ్లవారిగూడెం. తనకున్న 20 ఎకరాల్లో 15 ఎకరాల్లో బత్తాయి తోట... అయిదు ఎకరాల్లో వరి నాట్లు వేశారు. బోర్లలో నీళ్లు లేక ఇప్పటికే మూడు ఎకరాల్లో వరి ఎండిపోయింది. బత్తాయి తోటను బతికించుకోవడానికి నెల రోజుల్లో 21 బోర్లు వేశారు. 440 నుంచి 550 అడుగులు వేసినా చుక్క నీరు కూడా పడలేదని బోర్లకే రూ.10 లక్షల వరకు ఖర్చు చేశానని ఆయన ‘ఈనాడు’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.


రూ.2 లక్షల వరకు ఖర్చు చేశా

ఈ రైతు పేరు మీసాల పరమేశ్‌. స్వగ్రామం కనగల్‌ మండలం చిన్నమాదారం. తనకున్న ఎకరంన్నరలో ప్రస్తుతం ఉన్న రెండు బోర్లు వట్టిపోవడంతో నెల క్రితం మరో నాలుగు వేశారు. 500 అడుగులు వేసినా నీళ్లు పడలేదని బోర్లకే రూ.2 లక్షల వరకు ఖర్చు చేశానని ‘ఈనాడు’కు వెల్లడించారు. నీటి సదుపాయం లేకపోవడంతో ఎకరం పొలంలో ఏ పంటను సాగు చేయలేక బీడుగానే ఉంచానన్నారు. ఇదే మండలంలోని బాబాసాయిగూడెం వాసి సుంకిరెడ్డి వెంకట్‌రెడ్డి గత నెలన్నర రోజుల్లో 12 బోర్లు వేసినా అన్నీ వట్టిపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని