కడెం పనులు కదలవేం..

నిర్మల్‌ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుపై నిర్లక్ష్యపు నీడలు తొలగడం లేదు. 65 ఏళ్ల కిందట నిర్మించిన ఈ ప్రాజెక్టును పటిష్ఠపరిచే ప్రణాళికలు అమలు కావడం లేదు.

Published : 24 Feb 2024 03:16 IST

అమలుకాని అయిదు కమిటీల నివేదికలు
మరో నాలుగు నెలల్లో వర్షాకాలం
నేడు ప్రాజెక్టు సందర్శనకు ఈఎన్సీ బృందం

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మల్‌ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుపై నిర్లక్ష్యపు నీడలు తొలగడం లేదు. 65 ఏళ్ల కిందట నిర్మించిన ఈ ప్రాజెక్టును పటిష్ఠపరిచే ప్రణాళికలు అమలు కావడం లేదు. 2022లో భారీ వరదలు జలాశయాన్ని కుదిపేశాయి. గతేడాది గేట్ల మొరాయింపుతో ముప్పు ఎదుర్కొంది. 7.5 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఈ జలాశయం కింద 65 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 3.60 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం దిగువకు వెళ్లేలా 18 క్రస్టు గేట్లను నిర్మించారు. ఇప్పటి వరకు ఒకేసారి అత్యధికంగా 6 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. గేట్లలో చాలావరకు సకాలంలో తెరుచుకోక వరద వచ్చిన ప్రతిసారీ జలాశయం ప్రమాదంలో పడుతోంది. ఈ ఏడాది వానాకాలానికి మరో 4 నెలల సమయమే ఉంది. అయినా మరమ్మతుల్లో ముందడుగు పడటం లేదు.

హడావుడి తప్ప కార్యాచరణ లేదు

ఈ ప్రాజెక్టు పటిష్ఠతకు ఇప్పటి వరకు అయిదు కమిటీలు నివేదికలు ఇచ్చాయి. డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానెల్‌, ఈఎన్సీ(జనరల్‌), సీఈ-సీడీఓ, నలుగురు సభ్యుల కమిటీ, ఎన్‌డీఎస్‌ఏ- ఎస్‌డీఎస్‌సీ(డ్రిప్‌) కమిటీలు పలు దఫాలుగా సూచనలు చేశాయి. నివేదికలు వచ్చినప్పుడు నీటిపారుదలశాఖ హడావుడి తప్ప కార్యాచరణ ఉండటం లేదు. కడెం మరమ్మతులకు పూర్తిస్థాయిలో నిధుల కేటాయింపులు లేవు. గతేడాది చివర్లో నీటిపారుదలశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ఈ జనవరిలో గేట్ల మరమ్మతులకు రూ.5.90 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రోప్‌లు, గేట్లు పైకి కిందకు నడిపేందుకు సంబంధించిన కాంపొనెంట్లకు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాలేదు. దీంతో మరోమారు పిలిచేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రికల్‌ పనులకు సంబంధించి రూ.3.41 కోట్లతో టెండర్లు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. 2022లో ఆప్రాన్‌ పునరుద్ధరణకు రూ.1.44 కోట్లు మంజూరు చేసినా పనులు కొలిక్కిరాలేదు.

దృష్టిసారించిన ప్రభుత్వం

ప్రాజెక్టు శాశ్వత పునరుద్ధరణ చర్యలు, తాత్కాలిక మరమ్మతు పనుల్లో వేగం పెంచాలని తాజాగా ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ శాఖ ఇంజినీర్లతో కలిసి శనివారం ప్రాజెక్టును సందర్శించనున్నారు. వానాకాలంలోపు చేపట్టాల్సిన చర్యలపై ఆయన సమీక్షించనున్నారు.


నివేదికలు ఏం చెప్పాయంటే..

  • జర్మన్‌ సాంకేతికతతో ఏర్పాటు చేసిన గేట్లను మార్చాలి.
  • స్పిల్‌వేను మార్చి నీటి విడుదల సామర్థ్యం పెంచాలి.
  • కడెం వాగుకు హఠాత్తుగా వరదలొస్తున్నందున ఎగువ ప్రాంతాల్లో ప్రవాహాన్ని ముందుగా అంచనా వేసేందుకు టెలీమెట్రీలు ఏర్పాటు చేయాలి.
  • గేట్లు సాఫీగా పనిచేసేందుకు రోప్‌లు, బేరింగ్‌లు వంటివి అమర్చాలి.
  • 2022, 2023 వర్షాకాలాల్లో వరదలకు కొట్టుకుపోయిన ఆప్రాన్‌, కౌంటర్‌ వెయిట్లు, కట్ట పైభాగం లాంటివి యుద్ధప్రాతిపదికన తిరిగి ఏర్పాటు చేయాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని