మత్తు ‘సూత్రధారుల’పై నిఘా

రాష్ట్రంలో మాదకద్రవ్యాల మహమ్మారిని కూకటివేళ్లతో సహా పెకలించాలని చూస్తున్న పోలీసులు ఇతర రాష్ట్రాల్లో నక్కిన సూత్రధారుల భరతం పట్టేందుకు సిద్ధమవుతున్నారు.

Published : 24 Feb 2024 03:19 IST

ఇతర రాష్ట్రాల్లో ఏజెంట్ల పట్టివేతలో టీ-న్యాబ్‌
మాదకద్రవ్యాల రవాణా నిరోధమే లక్ష్యం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మాదకద్రవ్యాల మహమ్మారిని కూకటివేళ్లతో సహా పెకలించాలని చూస్తున్న పోలీసులు ఇతర రాష్ట్రాల్లో నక్కిన సూత్రధారుల భరతం పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ముంబయి, గోవా, బెంగళూరుతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో పాగా వేసిన అనేక మంది సూత్రధారులు ఏజెంట్‌ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోకి మత్తుమందులు జొప్పిస్తున్నారు. వీరిని కట్టడి చేస్తేనే మాదకద్రవ్యాల రవాణా అడ్డుకోగలమని గ్రహించిన తెలంగాణ నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(టీన్యాబ్‌) అధికారులు అందుకు తగ్గట్లుగా వ్యూహం సిద్ధం చేస్తున్నారు. వివిధ దర్యాప్తు సంస్థల ద్వారా సేకరించిన సమాచారంతో ఏజెంట్ల జాబితా తయారు చేసి, ఒక్కొక్కర్నీ కట్టడి చేయడం మొదలుపెట్టారు. 

విక్రేతల అరెస్టుతో ఆగని సరఫరా

రాష్ట్రంలో ప్రధానంగా గంజాయితోపాటు స్థానిక, విదేశీ మాదకద్రవ్యాలు అందుబాటులో ఉంటున్నాయి. గంజాయి ఎక్కువ భాగం ఉత్తరాంధ్ర నుంచి వస్తుండటంతో సరఫరా మార్గాలపై దర్యాప్తు సంస్థలు కన్నేశాయి. ఫలితంగానే కొంతకాలంగా రాష్ట్రంలో పెద్దఎత్తున గంజాయి పట్టుబడుతోంది. ఇక చిన్నపాటి రసాయన పరిశ్రమల్లో యాంఫిటమైన్‌ టైప్‌ స్టిమ్యులెంట్స్‌(ఏటీఎస్‌) వంటి మత్తుమందులు తయారు చేస్తున్నారు. స్థానికంగా నిఘా పెంచడం ద్వారా ఇటువంటి వాటిని గుర్తిస్తున్నారు. ఖరీదైన కొకైన్‌, హెరాయిన్‌, ఎల్‌ఎస్డీ బ్లాట్లు వంటివి విదేశాల నుంచి సరఫరా అవుతున్నాయి. దీనికి సంబంధించిన నెట్‌వర్క్‌ ఛేదించడం కష్టంగా మారింది. స్థానికంగా విక్రయించేవారిని పట్టుకుంటున్నా సరఫరా మాత్రం ఆగడంలేదు. వారికి ఎవరు సరఫరా చేస్తున్నారన్నది తెలియడంలేదు. విదేశీ స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకున్న వీరు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉంటున్నారు. ఇందులో ఎక్కువ మంది నైజీరియా దేశస్థులే ఉన్నారు. మొత్తం 20 మంది దాకా ఉండవచ్చని టీ-న్యాబ్‌ పోలీసుల అంచనా. వీరిని పట్టుకోగలిగితే అంతర్జాతీయంగా సరఫరాను నియంత్రించవచ్చని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు.

మొదలైన కసరత్తు..

ఈ నెల 6న గోవాలో నైజీరియా వాసి ఉడుకా స్టాన్లీ అరెస్టు ఇందులో భాగమే. 2009లో వ్యాపార వీసా మీద ముంబయి వచ్చిన స్టాన్లీ ఆ తర్వాత మకాం గోవాకు మార్చాడు. అక్కడ నుంచి ఏజెంట్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకొని తెలంగాణకు మత్తుమందుల సరఫరా మొదలుపెట్టాడు. అలాగే ముంబయి, బెంగళూరు కేంద్రాలుగా మత్తుమందుల రాకెట్‌ నడిపిస్తున్న నైజీరియా దేశస్థులు బగ్చోనా డేవిడ్‌ అలియాస్‌ స్టాన్లీ, ఆగ్‌బాగో డేవిడ్‌ యూకా అలియాస్‌ ఫాస్టర్‌ డేవిసన్‌లను ఇలానే వలపన్ని పట్టుకున్నారు. గోవా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న జానీ డిసౌజా అలియాస్‌ స్టీవ్‌ను కూడా అరెస్టు చేశారు. సూత్రధారులు ఎక్కడ ఉన్నా పట్టుకోవడమే తమ ధ్యేయమని టీన్యాబ్‌ అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు