విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జన్నత్‌ హుస్సేన్‌ మృతి

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన జన్నత్‌ హుస్సేన్‌(73) శుక్రవారం ఉదయం కన్నుమూశారు.

Published : 24 Feb 2024 03:20 IST

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, సూళ్లూరుపేట: విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన జన్నత్‌ హుస్సేన్‌(73) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొన్నేళ్లుగా అల్జీమర్స్‌తో బాధపడుతున్న ఆయన తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని తన రెండో కుమారుడు నియాజ్‌ నివాసంలో తుదిశ్వాస విడిచారు. భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని కుందన్‌బాగ్‌ నివాసానికి తరలించారు. పంజాగుట్టలో శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. జన్నత్‌ హుస్సేన్‌కు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. 1977 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన జన్నత్‌హుస్సేన్‌ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు  కేటాయించిన తర్వాత పలు కీలక బాధ్యతలను నిర్వహించారు. నెల్లూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమ సహా వివిధ కీలక శాఖలను నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గానూ పనిచేశారు. 2004లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అమలు చేసినప్పుడు ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్నారు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, కె.రోశయ్య ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు..  సీఎం ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జన్నత్‌ హుస్సేన్‌ విధులు నిర్వహించారు. 2010 డిసెంబరు 31న పదవీవిరమణ పొందారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌గా నియమితులై 2014 వరకు కొనసాగారు.

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జన్నత్‌ హుస్సేన్‌ మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన ఆయన సుదీర్ఘకాలం సేవలందించారని సీఎం గుర్తుచేసుకున్నారు.  2004లో అమల్లోకి తెచ్చిన ఉచిత విద్యుత్‌ పథకం విధి విధానాలను రూపొందించి రైతులకు మేలు చేయడంలో జన్నత్‌ విశేష కృషిచేశారని రేవంత్‌రెడ్డి కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని