లాస్య నందితకు సీఎం రేవంత్‌రెడ్డి నివాళి

లాస్యనందిత భౌతికకాయానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం మేడారం వెళ్లిన ఆయన సాయంత్రం 4.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.

Published : 24 Feb 2024 03:22 IST

కుటుంబసభ్యులకు స్పీకర్‌, మంత్రులు, కేసీఆర్‌ సహా భారాస ఎమ్మెల్యేల పరామర్శ

ఈనాడు, హైదరాబాద్‌:  లాస్యనందిత భౌతికకాయానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం మేడారం వెళ్లిన ఆయన సాయంత్రం 4.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కణ్నుంచి నేరుగా కంటోన్మెంట్‌ కాకాగూడలోని లాస్యనందిత ఇంటికి చేరుకున్నారు. భౌతికకాయానికి నివాళి అర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. ‘లాస్యనందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దివంగత సాయన్నతో నాకు సన్నిహిత సంబంధం ఉండేది’ అని సీఎం పేర్కొన్నారు. వెంట మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం, పొంగులేటి ఉన్నారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ అంతకుమునుపు బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గాంధీ ఆసుపత్రికి వచ్చి పోలీసులతో మాట్లాడి ప్రమాద కారణాలు అడిగి తెలుసుకున్నారు. కంటోన్మెంట్‌ ప్రజలకు లాస్యనందిత ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌, దామోదర్‌ రాజనర్సింహ, తుమ్మల, జూపల్లి, కొండా సురేఖ, రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన రేణుకాచౌదరి, అనిల్‌కుమార్‌యాదవ్‌, ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్‌, బల్మూరి వెంకట్‌ ఇతర నేతలు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించారు.


నందిత అకాల మరణం బాధాకరం: కేసీఆర్‌

మాజీ సీఎం కేసీఆర్‌ లాస్యనందిత భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆమె తల్లిని, సోదరీమణులను ఓదార్చారు. ‘పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ప్రజా మన్ననలు పొందిన నందిత అకాల మరణం చెందడం బాధాకరం. పార్టీపరంగా కుటుంబానికి అండగా ఉంటాం’ అని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత రోజంతా అక్కడే ఉన్నారు. ఎంపీ కేశవరావు, మేయర్‌ విజయలక్ష్మి, భారాస ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, తలసాని, ప్రశాంత్‌రెడ్డి, పల్లా, మల్లారెడ్డి, ముఠా గోపాల్‌, రాజశేఖర్‌రెడ్డి, దానం నాగేందర్‌, సబితా, కాలేరు వెంకటేశ్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని