TS News: ఆ విద్యార్థినిని ఎంబీఏ పరీక్షకు అనుమతించండి

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగరీత్యా తల్లి ఏపీకి వెళ్లడంతో అక్కడే ఇంటర్‌, డిగ్రీ చదివిన తెలంగాణ విద్యార్థినికి ఎంబీఏ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడంపై కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Updated : 25 Feb 2024 07:02 IST

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడంపై కౌంటరు దాఖలు చేయండి
రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రైవేటు కళాశాలకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగరీత్యా తల్లి ఏపీకి వెళ్లడంతో అక్కడే ఇంటర్‌, డిగ్రీ చదివిన తెలంగాణ విద్యార్థినికి ఎంబీఏ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడంపై కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉన్నందున విద్యార్థిని నుంచి పరీక్ష ఫీజు స్వీకరించి, పరీక్షలకు అనుమతించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తనకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ వరంగల్‌ వాగ్దేవి కళాశాలలో ఎంబీఏ చేస్తున్న బి.వాసంతి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎస్సీ వర్గానికి చెందిన పిటిషనర్‌ 10వ తరగతి వరకు తెలంగాణలో చదివారన్నారు. మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న ఆమె తల్లి రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో ఖాళీలు లేక ఏపీకి వెళ్లారన్నారు. దీంతో వాసంతి అక్కడే ఇంటర్‌, బీఎస్సీ పూర్తి చేశారన్నారు.

అనంతరం తల్లి మృతి చెందడంతో తిరిగి తెలంగాణలోని అమ్మమ్మ ఇంటికి వచ్చి ఎంబీఏలో చేరారన్నారు. ఏపీలో డిగ్రీ పూర్తి చేసిన కారణంగా ఇక్కడ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడంలేదని, అంతేకాకుండా పరీక్ష ఫీజు కూడా తీసుకోవడంలేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. విద్యార్థినిని పరీక్షలకు అనుమతించాలని కళాశాలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే పిటిషన్‌ తేలేదాకా ఫలితాలు వెల్లడించరాదని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కల్పించకపోవడంపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్లతోపాటు కళాశాలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను మార్చి 3కు వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని