TS News: నేడు గురుకుల జేఎల్‌, డీఎల్‌ల తుది ఫలితాలు

సంక్షేమ గురుకులాల్లో 2,717 జూనియర్‌, డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో తుది ఎంపిక ఫలితాలను నియామక బోర్డు ఆదివారం వెల్లడించనుంది.

Updated : 25 Feb 2024 08:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: సంక్షేమ గురుకులాల్లో 2,717 జూనియర్‌, డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో తుది ఎంపిక ఫలితాలను నియామక బోర్డు ఆదివారం వెల్లడించనుంది. జూనియర్‌ కళాశాలల్లో 1,924.. డిగ్రీ కాలేజీల్లో 793 అధ్యాపక పోస్టులకు గతేడాది ఆగస్టులో రాతపరీక్ష జరిగింది. అందులో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాలను ఈ నెల రెండో వారంలో బోర్డు విడుదల చేసింది. ఈ నెల 19, 20 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టింది. ఆ వెంటనే డెమో తరగతులు నిర్వహించింది. డెమో తరగతుల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలను వెల్లడించనుంది. దివ్యాంగుల కేటగిరీలో అర్హత పొందిన అభ్యర్థులకు రెండు రోజుల్లో వైద్య పరీక్షలు చేసి.. ఫలితాలు ప్రకటించాలని భావిస్తోంది.

మరోసారి అర్హతల పరిశీలన: డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన, డెమో తరగతులకు హాజరైన అభ్యర్థుల విద్యార్హతలను గురుకుల నియామక బోర్డు మరోసారి పరిశీలిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అభ్యర్థి స్థానికత, కుల ధ్రువీకరణ, పీజీ, సెట్‌ పరీక్షలో ఎప్పుడు ఉత్తీర్ణులయ్యారు? నోటిఫికేషన్‌ తేదీ నాటికి తప్పనిసరి విద్యార్హతలన్నీ సాధించారా? లేదా? అన్న వివరాలను గత రెండు రోజులుగా బోర్డు బృందాలు పరిశీలించాయి. ఆదివారం మధ్యాహ్నానికి బోర్డు సమావేశంలో ఫలితాలను ఆమోదించి.. తుది ఎంపిక జాబితాలను వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని