వరద వచ్చేలోగా కాళేశ్వరం పునరుద్ధరణ సాధ్యమేనా?

గత ఏడాది అక్టోబరులో కాళేశ్వరం ఎత్తిపోతలలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, పియర్స్‌ దెబ్బతినడం.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీలు ఏర్పడటంతో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది.

Updated : 25 Feb 2024 07:29 IST

అన్నారంలో నీరు ఖాళీ చేసినా ఓ పియర్‌ వద్ద కొనసాగుతున్న సీపేజీ
ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఇచ్చాకే ముందడుగు వేయాలని ప్రభుత్వ నిర్ణయం
మేడిగడ్డలో కాఫర్‌ డ్యాం నిర్మాణంపై ముందుకురాని గుత్తేదారు సంస్థ
పంపుహౌస్‌ మునగకుండా చేపట్టిన పనులూ అసంపూర్తిగానే


గత ఏడాది అక్టోబరులో కాళేశ్వరం ఎత్తిపోతలలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, పియర్స్‌ దెబ్బతినడం.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీలు ఏర్పడటంతో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు డిజైన్‌, నాణ్యత, నిర్వహణ.. ఇలా అన్నింటిలోనూ లోపాలు ఉన్నాయని తేల్చి చెప్పారు. అన్నారం, సుందిళ్లలోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుందని, నీటిని ఖాళీ చేయాలని సూచించారు. తర్వాత విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తులో మేడిగడ్డ బ్యారేజీకి మరింత ఎక్కువగా నష్టం వాటిల్లినట్లు తేలింది. అన్నారం బ్యారేజీని కూడా నేషనల్‌ డ్యాం సేఫ్టీ అధికారులు పరిశీలించారు. సీపేజీని అరికట్టడానికి కెమికల్‌ గ్రౌటింగ్‌ చేస్తే వేరే చోట సీపేజీలు వచ్చాయి. ఇప్పటికీ డబుల్‌ పియర్‌ ఉన్న 35వ గేటు వద్ద సీపేజీ కొనసాగుతున్నట్లు తెలిసింది. అరికట్టే ప్రయత్నాలు జరుగుతున్నా, ఇంకా సీపేజీ వస్తున్నట్లు సమాచారం.


మళ్లీ సమస్యలు రాకుండా ఉండేందుకు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీతో మూడు బ్యారేజీలను నిశితంగా తనిఖీ చేయించి.. వారిచ్చే సిఫార్సు మేరకు ముందుకెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆమేరకు ఈ నెల 13న నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా.. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీకి, కేంద్ర జలసంఘానికి లేఖలు రాశారు. కమిటీని పంపాలని కోరారు.


ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు దెబ్బతినడానికి కారణమేంటో ఇంకా తెలియదు. మేడిగడ్డలో కుంగిన పియర్‌ వద్ద మరమ్మతులకు ఇప్పటివరకు కాఫర్‌డ్యాం నిర్మాణం ప్రారంభం కాలేదు. అన్నారం బ్యారేజీలో పూర్తిగా నీటిని ఖాళీ చేసిన తర్వాత కూడా ఓ పియర్‌ వద్ద సీపేజీ కొనసాగుతోందని తాజాగా గుర్తించారు. గతంలో వచ్చిన భారీ వరదకు అన్నారం బ్యారేజీ వద్ద పంపుహౌస్‌ నీట మునిగింది. మరోసారి మునగకుండా చేపట్టిన నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. ఈ పనులన్నీ ఎప్పుడవుతాయో తెలియదు. కానీ మరో 3 నెలల్లో వర్షాకాలం ప్రారంభం కానుంది. భారీ వరద వస్తే పరిస్థితి ఏంటన్న ఆందోళన సాగునీటిశాఖ వర్గాల్లో నెలకొంది. కొన్నిసార్లు ప్రధాన గోదావరికి వరద ఆలస్యంగా వచ్చినా.. ప్రాణహితకు మాత్రం ముందుగానే ప్రారంభమవుతుంది. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

రాష్ట్ర డ్యాం సేఫ్టీ ఇంజినీర్లు గుర్తించిన సమస్యలు

మూడు రోజుల క్రితం రాష్ట్ర డ్యాం సేఫ్టీ అధికారుల బృందం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించి ఎక్కడెక్కడ నష్టం వాటిల్లిందో ప్రాథమికంగా అంచనా వేసింది. ‘‘మేడిగడ్డ 20వ పియర్‌లో గేటు దగ్గర పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. ఇవి 75 మి.మీ. నుంచి 350 మి.మీ. వరకు ఉన్నాయి. 19, 21 పియర్ల స్ట్రక్చర్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ 3 పియర్ల వద్ద రాఫ్ట్‌ దెబ్బతింది. 20వ పియర్‌ 1.356 మీటర్లు, 19వ పియర్‌ 0.84 మీ., 21వ పియర్‌ 0.14 మీ., 18వ పియర్‌ 0.21 మీ. మేర కుంగాయి. 6, 7, 8 బ్లాక్‌ల దిగువన 1.5 మీ. మేర ఇసుక మేట వేసింది. అన్నారంలోనూ 3 బ్లాక్‌లలో లాంచింగ్‌ ఆఫ్రాన్‌ల మీద ఇసుక ఉంది. బ్యారేజీ మొత్తం ఎగువ భాగంలో 1.5 నుంచి 2.5 మీ. మేర ఇసుక నిల్వలు ఉన్నాయి. 42 వెంట్స్‌లో వియరింగ్‌ కోట్‌ దెబ్బతినడం, సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, సీపేజీ లాంటి సమస్యలు ఉన్నాయి’’ అని గుర్తించింది. అయితే నేషనల్‌ డ్యాం సేఫ్టీ కమిటీ పరిశీలించిన తర్వాత కానీ ముందుకు వెళ్లే పరిస్థితి లేదు.

కాఫర్‌డ్యాంపై..

మేడిగడ్డలో రూ.54 కోట్లకు అనుబంధ ఒప్పందం చేసుకొంటే కానీ కాఫర్‌డ్యాం పని చేయబోమని గుత్తేదారు సంస్థ ఎల్‌ అండ్‌ టీ తేల్చి చెప్పింది. దీంతో ఏ రకంగా చూసినా ఈ సీజన్‌లో బ్యారేజీ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేదు. అయితే ‘‘మేడిగడ్డలో ఇప్పటివరకు కుంగిన ఏడో బ్లాక్‌ వద్ద మినహా మిగిలిన బ్యారేజీలో ఎక్కడేం జరిగిందో పరిశీలించలేదు. మిగిలిన చోట ఏం కాలేదని నిర్ధారించుకొని కాఫర్‌డ్యాం నిర్మిస్తే ప్రయోజనం ఉంటుంది. లేదంటే బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది’’ అని నీటిపారుదలశాఖ వర్గాల అభిప్రాయం.

అన్నారం, సుందిళ్లలో సీపేజీని పూర్తిస్థాయిలో అరికట్టే పనులు కూడా వరద వచ్చే లోగా పూర్తవుతాయా అనే సంశయమూ ఉంది.

పంపుహౌస్‌పై...

గతంలో భారీ వరదకు అన్నారం బ్యారేజీ వద్ద పంపుహౌస్‌ నీటమునిగింది. బ్యాక్‌వాటర్‌ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని 132 మీ. వద్ద పంపుహౌస్‌ బే నిర్మించడానికి మొదట ఆమోదం తెలిపిన నీటిపారుదలశాఖ తర్వాత 124 మీ. తగ్గించింది. ఆ డిజైన్‌ మేరకు గుత్తేదారు నిర్మించారు. తర్వాత 130 మీ.కుపైగా నీటి ప్రవాహం రావడంతో పంపుహౌస్‌ నీట మునిగింది. మళ్లీ ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు 950 మీ. మేర కాంక్రీటు గోడ నిర్మాణం చేపట్టారు. జాప్యం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం అనుమతి రాకముందే పనులు ప్రారంభించారు. సుమారు 650 మీ. నిర్మాణం పూర్తయ్యింది. 135.5 మీ. మట్టం వరకు వరద వచ్చినా పంపుహౌస్‌కు ఏమీ కాకుండా ఈ పని చేపట్టామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పని ఇంకా 300 మీ. పూర్తి కావాల్సి ఉంది. రూ.68.84 కోట్ల విలువ గల ఈ పనికి ప్రభుత్వం నుంచి ఇంకా పరిపాలన అనుమతి రాకపోవడంతో చేసిన పనికి గుత్తేదారుకు బిల్లులు చెల్లించలేదు. ఆరు నెలలకు పైగా పరిపాలన అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. ఈ కారణంగా పని నెమ్మదించిందని, మరో మూడు నెలల్లోగా మిగిలిన పనిని పూర్తి చేయకపోతే.. మళ్లీ వరద వస్తే పంపుహౌస్‌కు నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తమ్మీద మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు అన్ని పనులపై వర్షాకాలం లోగానే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నీటిపారుదలశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని