వీఐపీల కారు డ్రైవర్లకు ఫిట్‌నెస్‌ పరీక్ష

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా త్వరలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ల కారు డ్రైవర్లకు ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహించి వారి సామర్థ్యాన్ని అంచనా వేస్తామని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Published : 25 Feb 2024 07:22 IST

మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా త్వరలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ల కారు డ్రైవర్లకు ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహించి వారి సామర్థ్యాన్ని అంచనా వేస్తామని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘ఈ మధ్యకాలంలో అనుభవం లేని డ్రైవర్ల కారణంగా రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతున్న వీఐపీల సంఖ్య పెరుగుతోంది. యువ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం నన్ను కలిచివేసింది. వీఐపీలందరికీ వారి డ్రైవర్లను పరీక్షకు పంపాలని లేఖలు పంపుతాం. పరీక్ష తరువాత వారి రిపోర్టును అందజేస్తాం. సుదూర ప్రయాణాలకు అనుభవజ్ఞులైన డ్రైవర్లనే నియమించుకోవాలి. ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహిళలు పెద్ద సంఖ్యలో ఉపయోగించుకుంటుండటంతో ఆలయాల ఆదాయమూ పెరుగుతోంది. భారాస ప్రభుత్వంలో ఆర్టీసీకి రూ.6 వేల కోట్ల అప్పులు ఉండేవి. ఇప్పుడిప్పుడే సంస్థ లాభాల బాటపడుతోంది. ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నాం. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడి, వాటి నుంచి తప్పించుకునేందుకు కొందరు నేతలు ప్రస్తుతం పార్టీలు మారుతున్నా వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు’ అని స్పష్టం చేశారు. పొన్నం ప్రభాకర్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంటు ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. జానారెడ్డి నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని