టీజీటీ మెరిట్‌ జాబితా వెల్లడి

సంక్షేమ గురుకులాల్లో 4,006 ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాలను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది.

Published : 26 Feb 2024 04:46 IST

ఈ నెల 27, 28 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: సంక్షేమ గురుకులాల్లో 4,006 ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాలను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. ఆ జాబితాలోని అభ్యర్థులకు 27, 28 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల   పరిశీలన చేపట్టనుంది. సబ్జెక్టుల వారీగా మెరిట్‌ జాబితాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు, ధ్రువీకరణ పత్రాల పరిశీలన షెడ్యూల్‌ను బోర్డు వెబ్‌సైట్లో పొందుపరిచింది. అభ్యర్థులకు బంజారాహిల్స్‌లోని బంజారాభవన్‌, ఆదివాసీ కుమురంభీం భవన్‌, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన కొనసాగనుంది. పత్రాల పరిశీలన తరువాత రెండు రోజుల్లో తుది ఎంపిక జాబితాలు ప్రకటించనుంది.

టీజీటీ ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఇలా...

  • 27న బంజారాభవన్‌లో ఇంగ్లిష్‌ సబ్జెక్టుకు, ఆదివాసీ భవన్‌లో ఉదయం బయోసైన్స్‌, మధ్యాహ్నం జనరల్‌ సైన్స్‌కు, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉదయం సోషల్‌ స్టడీస్‌, మధ్యాహ్నం తెలుగు సబ్జెక్టుకు పరిశీలన కొనసాగుతుంది.
  • 28న బంజారాభవన్‌లో గణితం సబ్జెక్టుకు, ఆదివాసీ భవన్‌లో ఫిజికల్‌ సైన్స్‌ సబ్జెక్టుకు, పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఉదయం హిందీ, మధ్యాహ్నం హిందీ, ఉర్దూ, సంస్కృతం సబ్జెక్టులకు పరిశీలన ఉంటుంది.

వైద్యపరీక్షల నివేదికల ఆలస్యంతో..

సంక్షేమ గురుకులాల్లో 2,717 జూనియర్‌, డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల తుది ఎంపిక ఫలితాలు ఆదివారం వెల్లడించాలని గురుకుల బోర్డు భావించినప్పటికీ సాంకేతిక కారణాలతో వాయిదా వేసింది. ఈ పోస్టులకు ఎంపికైన దివ్యాంగ అభ్యర్థుల వైద్యపరీక్షలు పూర్తికాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం వైద్యపరీక్షలు నిర్వహించిన వారిలో కొందరిని మెడికల్‌ బోర్డుకు వైద్యఆరోగ్యశాఖ సిఫార్సు చేసింది. బోర్డు సోమవారం మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించనుంది. ఈ ప్రక్రియ సోమవారం లేదా మంగళవారానికి పూర్తికానుంది. వైద్యపరీక్షల వివరాలు వెల్లడైన వెంటనే జూనియర్‌ కళాశాలల్లో 1,924, డిగ్రీ కళాశాలల్లో 793 అధ్యాపక పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలు వెల్లడి కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని