విచారణకు హాజరు కాలేను

దిల్లీ మద్యం కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 26న(సోమవారం) విచారణకు హాజరు కావాలంటూ.. సీబీఐ పంపిన నోటీసులపై భారాస ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

Published : 26 Feb 2024 04:46 IST

నోటీసులను రద్దు చేయండి
సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: దిల్లీ మద్యం కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 26న(సోమవారం) విచారణకు హాజరు కావాలంటూ.. సీబీఐ పంపిన నోటీసులపై భారాస ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల రీత్యా.. ఈ నెల 26న విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని, సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ మేరకు సీబీఐకి ఆదివారం ఆమె లేఖ రాశారు. ‘‘సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదు. 2022 డిసెంబరులో అప్పటి ఐవో ఇదే తరహా నోటీసును సెక్షన్‌ 160 కింద ఇచ్చారు. గతంలో జారీ చేసిన సెక్షన్‌ 160 నోటీసుకు.. ప్రస్తుత సెక్షన్‌ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉంది. ఎందుకు, ఏ పరిస్థితుల్లో సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదు. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో నా పాత్ర లేదు. గతంలో ఈడీ నోటీసులు జారీ చేయగా.. సుప్రీంకోర్టును ఆశ్రయించాను. ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. నన్ను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు.

ఆ హామీ సీబీఐకి కూడా వర్తిస్తుంది. గతంలో సీబీఐ బృందం హైదరాబాద్‌లోని నా నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించా. నియమ నిబంధనలను కట్టుబడి ఉండే దేశ పౌరురాలిగా సీబీఐ దర్యాప్తునకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తా. కానీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేయడం, సెక్షన్ల మార్పు అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. నాకు మా పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించింది. రానున్న ఆరు వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, పార్టీ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో దిల్లీకి విచారణ నిమిత్తం పిలవడం అందులో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుంది. ఇది నా ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుంది. ఈ కారణాల రీత్యా ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కాలేను. ఒకవేళ నా నుంచి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే.. వర్చువల్‌ పద్ధతిలో హాజరు కావడానికి అందుబాటులో ఉంటాను’’ అని సీబీఐకి రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని