త్వరలో నూతన విద్యుత్తు విధానం

రాష్ట్రంలో త్వరలో నూతన విద్యుత్తు విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Published : 26 Feb 2024 04:47 IST

ఉప ముఖ్యమంత్రి భట్టి

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో త్వరలో నూతన విద్యుత్తు విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రామవరంలో సింగరేణి రూ.56.76 కోట్ల వ్యయంతో నిర్మించిన 10.5 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంటును ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం సింగరేణి సీఎండీ బలరాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భట్టి మాట్లాడారు. ‘మేం అధికారంలో లేకుంటే విద్యుత్తు కష్టాలు తప్పవని భారాస పెద్దలు ఎన్నికల ప్రచారంలో ప్రజలను భయపెట్టారు. కరెంట్‌ కావాలా? కాంగ్రెస్‌ కావాలా? అన్నారు. కానీ ప్రజలు మాత్రం కరెంటు, కాంగ్రెస్‌ రెండూ కావాలని తీర్పునిచ్చారు’ అని భట్టి అన్నారు. మిగులు విద్యుత్తు గల రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సౌర, పవన విద్యుదుత్పత్తికి ప్రాధాన్యమిస్తుందన్నారు. పగలు సౌర విద్యుత్తుతో   ఎత్తయిన ప్రాంతాల్లోని జలాశయాలు నింపి, రాత్రి తిరిగి జలవిద్యుత్తు తయారుచేసే ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

భారాస చేసిందేమీ లేదు..

భారాస ప్రభుత్వం తమ పాలనలో విద్యుత్తుపరంగా కొత్తగా చేసిందేమీ లేదని భట్టి విమర్శించారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన కర్మాగారాలే నేడు రాష్ట్రానికి విద్యుత్తును అందిస్తున్నాయన్నారు. కాలం చెల్లిన సాంకేతికతతో నిర్మించిన మణుగూరులోని భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కర్మాగారం (బీటీపీఎస్‌) మున్ముందు భారంగా మారుతుందన్నారు. యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు కర్మాగారంలో ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాలేదన్నారు. కాంగ్రెస్‌ సర్కారు పాలనలో విఫలం కావాలని కొందరు చూస్తున్నారని, వారికి ఆ అవకాశం ఇవ్వబోమని విక్రమార్క వ్యాఖ్యానించారు. మహాలక్ష్మి పథకం కింద 17.5 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 27న చేవెళ్లలో జరిగే సభలో రూ.500కే సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. త్వరలో మహిళలకు వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సింగరేణి ప్రాంతాల్లోని గనులను ఆ సంస్థే దక్కించుకుంటుందని ఆయన చెప్పారు. ఆ సంస్థ నిర్మించే 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు కర్మాగారానికి ప్రభుత్వం అనుమతినిచ్చిందన్నారు. ఔట్ సోర్సింగ్‌ కార్మికుల వేతన సవరణ అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖను ఆదేశించినట్లు గుర్తుచేశారు. భవిష్యత్తులో విద్యుత్తు అవసరాలు తీర్చుకునేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఆధారపడాల్సి ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీలతో ఇళ్లపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని విద్యుతు భారాన్ని తగ్గించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో 30 లక్షల పంపుసెట్లు ఉన్నాయని, వాటిని సౌర శక్తి సాయంతో నడిపేలా చూస్తే ప్రభుత్వంపై ఉచిత విద్యుత్తు భారం తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ప్రియాంక అల, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మట్టా రాగమయి, పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, జడ్పీ ఛైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, ఏఐటీయూసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకుడు జనక్‌ప్రసాద్‌, సీఎంవోఏఐ అధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని