పరిహారం చెల్లించాల్సిందే

రోడ్డు ప్రమాదంలో 75 శాతం వైకల్యం పొందిన బాధితుడు రామిశెట్టి శ్రీనివాసరావుకు ఓరియంటల్‌ బీమా కంపెనీ రూ.1.27 కోట్లు చెల్లించాలని హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది.

Published : 26 Feb 2024 04:27 IST

రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.1.27 కోట్లు కట్టండి
బీమా కంపెనీకి హైకోర్టు ఆదేశాలు

ఖమ్మం న్యాయవిభాగం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో 75 శాతం వైకల్యం పొందిన బాధితుడు రామిశెట్టి శ్రీనివాసరావుకు ఓరియంటల్‌ బీమా కంపెనీ రూ.1.27 కోట్లు చెల్లించాలని హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. 2014 అక్టోబరు 22న ఖమ్మం నగరానికి చెందిన రామిశెట్టి శ్రీనివాసరావు తమ కారులో ఖమ్మం నుంచి విజయవాడ వెళుతున్నారు. డ్రైవర్‌.. కారును అతి వేగంగా, అజాగ్రత్తగా నడిపి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టాడు. శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలై 75 శాతం వైకల్యం ఏర్పడింది. దీంతో రూ.1.75 కోట్ల నష్ట పరిహారం కోరుతూ బాధితుడు 2015 జులై 30న ఖమ్మం జిల్లా మోటారు ప్రమాద ట్రైబ్యునల్‌లో కేసు దాఖలు చేశారు. ప్రమాదానికి గురైన కారు బాధితుడి భార్య పేరుపై ఉన్నందున శ్రీనివాసరావు కూడా యజమానే అవుతారని, ఆయనకు పరిహారం ఇవ్వడం కుదరదని బీమా కంపెనీ వాదించింది. న్యాయమూర్తి పి.చంద్రశేఖరప్రసాద్‌ బాధితుడికి రూ.1.25 కోట్లు 6 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశిస్తూ 2019 డిసెంబరు 2న తీర్పు చెప్పారు. ఈ తీర్పును సవాలు చేస్తూ బీమా కంపెనీ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. బాధితుడు సైతం తనకు పరిహారం పెంచాలని హైకోర్టును వేడుకున్నారు. వాదనలు విన్న జస్టిస్‌ పి.శ్యాంకోశీ, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బీమా కంపెనీ దాఖలు చేసిన అప్పీలును కొట్టేసింది. ట్రయల్‌ కోర్టు ఇచ్చిన పరిహారానికి అదనంగా మరో రూ.2 లక్షలు పెంచుతూ న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు. జిల్లాలో కేసు దాఖలు చేసిన తేదీ నుంచి 6 శాతం వార్షిక వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని