మూడున్నరేళ్లయినా... ముందడుగేదీ?

తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో కొత్త ఆబ్కారీస్టేషన్ల ఏర్పాటు ప్రక్రియపై అనిశ్చితి నెలకొంది. మూడున్నరేళ్ల క్రితమే 14 కొత్త స్టేషన్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీఅయినా ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Published : 26 Feb 2024 04:28 IST

ఆబ్కారీ పునర్వ్యవస్థీకరణలో అనిశ్చితి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో కొత్త ఆబ్కారీస్టేషన్ల ఏర్పాటు ప్రక్రియపై అనిశ్చితి నెలకొంది. మూడున్నరేళ్ల క్రితమే 14 కొత్త స్టేషన్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీఅయినా ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం విమర్శలకు తావిస్తోంది. వాస్తవానికి 2020 సెప్టెంబరులోనే శాఖను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 131 పోస్టుల్లో మార్పులుచేర్పులతో పాటు క్షేత్రస్థాయిలో కీలకమైన 14 ఎక్సైజ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఆ ఉత్తర్వుల ప్రకారం కానిస్టేబుళ్ల నుంచి అదనపు కమిషనర్‌ వరకు కొత్త పోస్టులు జారీ అయ్యాయి. అంతేకాకుండా అప్పటివరకు అప్రధానంగా ఉన్న జూనియర్‌ అసిస్టెంట్లు, డ్రైవర్లు, హెల్పర్లు, ఆఫీసు సబార్డినేట్లు, స్వీపర్లు, టైపిస్టులు, కాపలాదారులవంటి పోస్టులను తొలగించారు. అలాగే హైదరాబాద్‌, సరూర్‌నగర్‌, శంషాబాద్‌, మల్కాజిగిరి ఎక్సైజ్‌ జిల్లాల పరిధిలో కొత్త స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో జనాభా పెరగడాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్సైజ్‌శాఖను పునర్వ్యవస్థీకరించిన తర్వాత అంత భారీ స్థాయిలో మార్పులు చేయాలని నిర్ణయించడం ఇదే కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకొంది. దాదాపు మూడున్నరేళ్లు గడిచినా కొత్త స్టేషన్ల ఏర్పాటుపై ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. సిబ్బంది కొరతతోపాటు ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉండడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆబ్కారీశాఖలో 614 మంది కానిస్టేబుళ్లు శిక్షణలో ఉన్నారు. మరికొద్ది రోజుల్లో వీరు విధుల్లో చేరనున్నారు. ఈ నేపథ్యంలోనైనా కొత్త ఆబ్కారీస్టేషన్లను అందుబాటులోకి తీసుకురావడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని