సాగు భూముల క్రయవిక్రయాలు మందగమనం

ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో సాగు భూముల క్రయవిక్రయాలు మందగించాయి. వీటిపై రిజిస్ట్రేషన్ల రాబడి గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గింది.

Updated : 26 Feb 2024 04:37 IST

రూ.393 కోట్లు తగ్గిన రిజిస్ట్రేషన్ల రాబడి

ఈనాడు, హైదరాబాద్‌: ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో సాగు భూముల క్రయవిక్రయాలు మందగించాయి. వీటిపై రిజిస్ట్రేషన్ల రాబడి గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గింది.  గతేడాది ఫిబ్రవరి 20 నాటికి  6,56,605 సాగు భూముల రిజిస్ట్రేషన్లతో రూ.1,812 కోట్ల రాబడి వచ్చింది. ఇదే సమయానికి ఈ ఏడాది 5,31,749 డాక్యుమెంట్లతో రూ.1,419 కోట్ల ఆదాయం మాత్రమే నమోదైంది. 2022-23  జూన్‌లో గరిష్ఠంగా రూ.161.98 కోట్ల రాబడిరాగా 2023-24 జూన్‌లో గరిష్ఠంగా రూ.220.34 కోట్ల ఆదాయం సమకూరింది.

ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నాటి నుంచి దస్తావేజుల రిజిస్ట్రేషన్లు, రాబడులు మరింత తగ్గుముఖం పట్టాయి. 2022-23 నవంబరులో 52,764 దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ ద్వారా రూ.150.57 కోట్ల రాబడి వచ్చింది. 2023-24 అదే నెలలో 22,743 దస్తావేజులతో రూ.87.18 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. తర్వాత డిసెంబరు, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ పుంజుకోలేదు. మొత్తంగా దస్తావేజుల సంఖ్య గత ఏడాది కన్నా.. ఈసారి 1,24,856 తగ్గింది.

రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో సాగు భూములను కొనుగోలు చేసి అభివృద్ధి చేయడం, స్తిరాస్థి రంగంలోకి మార్పిడి చేసుకునే ప్రక్రియల్లో వేగం తగ్గిందని మార్కెటింగ్‌ నిపుణులు చెబుతున్నారు. జిల్లాల్లోనూ వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు ఈ ఏడాది పెద్దగా నమోదు కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని