రైతు వేదికల్లో ఇక ‘దృశ్యశ్రవణం’

రైతులు, వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి సభ్యులు, శాస్త్రవేత్తలు సమావేశమై సాగు సమస్యలపై చర్చించుకునేందుకు వీలుగా నిర్మించిన రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సింగ్‌ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 26 Feb 2024 07:04 IST

110 కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్సింగ్‌ వ్యవస్థ
నేడు ట్రయల్‌ రన్

ఈనాడు, హైదరాబాద్‌: రైతులు, వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి సభ్యులు, శాస్త్రవేత్తలు సమావేశమై సాగు సమస్యలపై చర్చించుకునేందుకు వీలుగా నిర్మించిన రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సింగ్‌ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా 110 కేంద్రాలను ఎంపికచేసి, టీవీలు, ఇతర సామగ్రిని సమకూరుస్తున్నారు. త్వరలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్సింగ్‌ సౌకర్యాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ప్రతి 5 వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా విభజించి, ప్రతి క్లస్టర్‌లో ఒక రైతు వేదిక చొప్పున రాష్ట్రవ్యాప్తంగా రూ.572.22 కోట్లతో 2,601 వేదికలను నిర్మించారు. ఒక్కో వేదిక కోసం కనీసం ఎకరా భూమిని ప్రభుత్వం కేటాయించింది. ప్రతి రైతు వేదికలో వ్యవసాయ శాఖ విస్తరణాధికారుల (ఏఈవోల)కు, కోఆర్డినేటర్లకు ఒకటి చొప్పున ఛాంబర్‌, 200 మంది రైతులు కూర్చునేందుకు వీలుగా సమావేశ మందిరం, రిసెప్షన్‌, రెండు మరుగుదొడ్లు నిర్మించారు. వేదికల నిర్వహణ కోసం ప్రతి నెలకు రూ.9 వేల వంతున ప్రభుత్వం మంజూరు చేస్తోంది. వాటితో కరెంటు బిల్లులు, మౌలిక వసతుల కల్పన, మురుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం వాటిలో రైతులకు శిక్షణ, పథకాలపై అవగాహన కార్యక్రమాలు, రైతు సమన్వయ సమితి సమావేశాలు నిర్వహిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, ఆయిల్‌పామ్‌ సాగుపై దరఖాస్తులు తీసుకుంటున్నారు. రైతు వేదికలను బహుళ వినియోగంలోకి తెచ్చేందుకు, రైతులకు మరింత చేరువ చేసేందుకు, గ్రామస్థాయిలోని వారితోనూ మాట్లాడేందుకు వీలుగా వీడియో కాన్ఫరెన్సింగ్‌ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ప్రయోగాత్మకంగా (పైలట్‌ ప్రాజెక్టు) ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఒక్కో రైతు వేదికలో ప్రారంభించాలని నిర్ణయించింది. వీడియో కాన్ఫరెన్స్‌కు అనువైన నెట్‌వర్క్‌ గల వాటిని ఎంపిక చేసింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌, టీఎస్‌స్వాన్‌ (టీఫైబర్‌) నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. రైతు వేదికల్లో ప్రస్తుతం 125 కుర్చీలు, రెండు టేబుళ్లు, 8 పెద్ద కుర్చీలు, ఒక మైక్‌సెట్‌ చొప్పున ఉండగా కొత్తగా రూ.3.70 లక్షలతో టెలివిజన్‌, సెట్‌టాప్‌ బాక్స్‌లు, ఇన్వర్టర్లు ఇతర సామగ్రిని అమర్చారు. దశలవారీగా మిగిలిన అన్నింటికీ వీడియో కాన్ఫరెన్సింగ్‌ వ్యవస్థను కల్పించనున్నారు. వీటికి సంబంధించి సోమవారం ఉదయం 11 గంటలకు ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. దీనికి రైతులు హాజరుకానున్నారు.

వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ఇక రైతువేదికల్లో రాష్ట్ర, జిల్లాస్థాయి వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులతో నేరుగా మాట్లాడి సలహాలు ఇస్తారు. పంటలకు సంబంధించిన లక్షణాలు, సాగు విధానాలు, చీడపీడలను వివరిస్తూ పరిష్కారాలు చూపుతారు. కొత్త పథకాలపై అవగాహన కల్పిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని