సైబర్‌ నేరస్థులపై ఇంటర్‌పోల్‌ నజర్‌

దర్యాప్తు సంస్థలు పట్టు బిగిస్తుండటంతో సైబర్‌ నేరగాళ్లు పంథామారుస్తున్నారు. ఇక్కడుంటే పట్టుబడతామన్న భయంతో విదేశాల్లో కాల్‌సెంటర్లు తెరిచి, దోపిడీలకు పాల్పడుతున్నారు.

Published : 26 Feb 2024 04:36 IST

దేశంలో నిఘా, దాడుల పెంపుతో విదేశాల నుంచి ముఠాల కార్యకలాపాలు
అరికట్టేందుకు దర్యాప్తు సంస్థల విభిన్న వ్యూహాలు
ఈనాడు, హైదరాబాద్‌

దర్యాప్తు సంస్థలు పట్టు బిగిస్తుండటంతో సైబర్‌ నేరగాళ్లు పంథా మారుస్తున్నారు. ఇక్కడుంటే పట్టుబడతామన్న భయంతో విదేశాల్లో కాల్‌సెంటర్లు తెరిచి, దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థలు ఇంటర్‌పోల్‌ సాయం తీసుకోవాలని భావిస్తున్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా సైబర్‌ముఠాల నేర సమాచారాన్ని సేకరిస్తున్నాయి.

దేశంలో సైబర్‌ నేరాలు శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోనే సగటున రోజుకు రూ.2 కోట్ల వరకూ దోచుకుంటున్నారు. ఈ మోసాలతో రాష్ట్రంలో ఓ వ్యక్తి ఏకంగా రూ.60 లక్షలు పోగొట్టుకోగా.. ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్న యువకుడు రూ.30 లక్షలు పోగొట్టుకున్నారు. ఇలా సైబర్‌ నేరగాళ్ల అరాచకాలు పెరుగుతుండటంతో కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలూ చర్యలు చేపట్టాయి. సైబర్‌ నేరాలకు కేంద్రంగా ఉన్న రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌, ఝార్ఖండ్‌లోని ఝాంతారా, పశ్చిమబెంగాల్‌లోని సిలిగురితోపాటు నోయిడా, గురుగ్రామ్‌ తదితర ప్రాంతాల్లో దాడులు పెంచారు. నేరాలకు పాల్పడుతున్న ముఠాలను గుర్తించి అరెస్టు చేయడంతోపాటు వారి వివరాలను అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నారు. ఆ నిందితులపై ఇతర రాష్ట్రాల్లో ఏమైనా కేసులుంటే.. వాటి ఆధారంగా ఎక్కువకాలం జ్యుడిషియల్‌ రిమాండులో ఉండేలా చూడటంతోపాటు శిక్షలు పడేలా చేస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్లు విదేశాలకు మకాం మారుస్తున్నారు.

ఫోన్‌ ద్వారా బోల్తా కొట్టించడమే వారి పని..

ఫోన్‌ ద్వారా మాయమాటలతో బోల్తా కొట్టించి ఖాతాలు ఖాళీ చేయడమే వీరి పని. నేర ముఠాలు ముందుగానే సమకూర్చి పెట్టే.. వ్యక్తుల బ్యాంకు ఖాతా నంబరు, పేరు, క్రెడిట్‌కార్డు నంబరు వంటి ప్రాథమిక వివరాల ద్వారా.. మిగతా సమాచారాన్ని (ముఖ్యంగా ఓటీపీ నంబరు) ఖాతాదారులతోనే చెప్పించి బోల్తా కొట్టిస్తున్నారు. ఇందుకు కావాల్సింది ఫోన్‌ సదుపాయమే. అందుకే ఇక్కడ నుంచి యువకులను ఉపాధి అవకాశాల పేరుతో ఇతర దేశాలకు తరలించి, అక్కడ కాల్‌సెంటర్లు పెట్టి కథ నడిపిస్తున్నారు. మయన్మార్‌, కాంబోడియా వంటి పేద తూర్పు ఆసియా దేశాలతోపాటు చైనా నుంచి కూడా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇది శ్రీలంకకు కూడా విస్తరించినట్లు తెలుస్తోంది. వాట్సప్‌ ద్వారా ఫోన్‌ చేస్తే, అది ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించడం కష్టం. ఒకవేళ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించినా వారిని అరెస్టు చేసి తీసుకు రావడం సాధ్యంకాదు. దీంతో ఇంటర్‌పోల్‌ సాయం తీసుకోవాలని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఇందుకోసం ఆయా వ్యక్తులు లేదా ముఠాలు పాల్పడ్డ నేరాలపై ఆధారాలు సేకరించి ఆ సంస్థకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. అనంతరం వారిపై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేసి.. ఏ విమానాశ్రయానికి వచ్చినా అదుపులోకి తీసుకొని మన దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తాయి.

రాష్ట్రంలో గతేడాది రూ.114 కోట్ల నిలిపివేత

సైబర్‌ నేరాలను అరికట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ఇండియన్‌ సైబర్‌క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ) సత్ఫలితాలు ఇస్తోంది. ఎవరైనా సైబర్‌ నేరాల బారినపడి డబ్బు పోగొట్టుకుంటే.. ఐ4సీ ఏర్పాటు చేసిన 1930 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి. ఆ సమయానికి సైబర్‌ నేరగాడు తన ఖాతాలో పడ్డ ఆ డబ్బును డ్రా చేసి ఉండకపోతే.. వాటిని బ్లాక్‌ చేసి.. తిరిగి బాధితుడి ఖాతాలో పడేలా చేస్తున్నారు. ఇది చాలావరకూ సత్ఫలితాన్ని ఇస్తోంది. గత ఏడాది తెలంగాణలో మొత్తం రూ.114 కోట్లను ఇలా నిలిపివేయగలిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని