నేటి నుంచి హెచ్‌ఐసీసీలో బయో ఆసియా సదస్సు

హెచ్‌ఐసీసీలో ప్రతిష్ఠాత్మక 21వ బయో ఆసియా సదస్సు సోమవారం(26న) నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో తొలిరోజు జీనోమ్‌వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌తో పాటు ఇతర కంపెనీలను విదేశీ ప్రతినిధులు సందర్శిస్తారు.

Published : 26 Feb 2024 04:37 IST

రేపు ప్రసంగించనున్న సీఎం రేవంత్‌రెడ్డి  

ఈనాడు, హైదరాబాద్‌: హెచ్‌ఐసీసీలో ప్రతిష్ఠాత్మక 21వ బయో ఆసియా సదస్సు సోమవారం(26న) నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో తొలిరోజు జీనోమ్‌వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌తో పాటు ఇతర కంపెనీలను విదేశీ ప్రతినిధులు సందర్శిస్తారు. 27న ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. ప్రపంచ దేశాల్లోని 100కి పైగా ప్రముఖ శాస్త్రవేత్తలు, విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జీవ వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు, ఔషధ రంగంలో ఆవిష్కరణలు, ఔషధ పరికరాల ప్రోత్సాహకాలపై చర్చలు జరుగుతాయి. ఈ అంశాలపై పరిశోధనలు చేస్తున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలు, చేయూతలపై పలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా నోబెల్‌ పురస్కార గ్రహీత, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు, ఆచార్య గ్రెగ్‌ ఎల్‌ సెమెంజాకు జీనోమ్‌వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ పురస్కారాన్ని అందజేయనున్నారు. 28న పలు చర్చాగోష్ఠిలతో పాటు ముగింపు సమావేశం ఉంటుంది. 700కి పైగా వినూత్న అంకుర సంస్థలు ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై ప్రదర్శనకు పోటీపడగా.. నిపుణులు 70 అంకుర సంస్థలను ప్రదర్శనకు ఎంపిక చేశారు. వీటిలో ఐదింటిని తుది జాబితాకు ఎంపిక చేసి, సదస్సు ఆఖరి రోజున ప్రత్యేక పురస్కారాలను అందజేస్తారు. 21వ బయో ఆసియా సదస్సుకు అనూహ్యమైన స్పందన లభించిందని, హైదరాబాద్‌ వేదికగా నూతన ఆవిష్కరణలను ప్రదర్శించడం సంతోషంగా ఉందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. జీవ వైద్య రంగంలో తెలంగాణ అంతర్జాతీయ ఖ్యాతిని విస్తరించడానికి ఈ సదస్సు దోహదపడుతుందన్నారు. ప్రపంచ వేదికపై తెలంగాణ జీవ వైద్య రంగం అభివృద్ధి చెందడానికి, నూతన ఆవిష్కరణలను శక్తిమంతం చేయడానికి, అద్భుత పరిష్కారాలను ప్రదర్శించడానికి ఈ సదస్సు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ సదస్సులో డేటా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విప్లవం అంశాలే ప్రధానంగా చర్చలు కొనసాగుతాయని తెలిపారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణను శిఖరాగ్రంలో నిలపడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని