అయిదు పదుల వయసులోనే నూరేళ్లూ నిండుతున్నాయి!

అడవి తల్లి ఒడిలో.. నల్లమల అటవీ ప్రాంతంలో జీవించే చెంచు గిరిజనులు పౌష్టికాహారానికి దూరమై దుర్భర జీవనం సాగిస్తున్నారు.

Published : 26 Feb 2024 04:38 IST

చెంచుల దుర్భర జీవనం

అచ్చంపేట, లింగాల, న్యూస్‌టుడే: అడవి తల్లి ఒడిలో.. నల్లమల అటవీ ప్రాంతంలో జీవించే చెంచు గిరిజనులు పౌష్టికాహారానికి దూరమై దుర్భర జీవనం సాగిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అమ్రాబాద్‌, పదర, లింగాల, బల్మూరు, అచ్చంపేట, కొల్లాపూరు, పెద్దకొత్తపల్లి మండలాల పరిధిలో 2,595 చెంచు కుటుంబాలు, 8,784 జనాభా.. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో కూడా 517 కుటుంబాలు, 1,710 జనాభా ఉన్నారు. అటవీ ప్రాంతంలో లభించే వివిధ రకాల ఉత్పత్తులను చెంచులు సేకరించి గిరిజన సహకార సంస్థ(జీసీసీ) కేంద్రాల్లో విక్రయించి.. నిత్యావసర సరకులు తీసుకునేవారు. ఎర్రపెంట ప్రాంతంలో అటవీ ఉత్పత్తుల సేకరణకు అటవీశాఖ అనుమతించడం లేదు. జీసీసీ సేవలూ వారికి అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో పౌష్టికాహారం లభించడం లేదు. సురక్షితమైన తాగునీరు లభించడం లేదు. ఫలితంగా రోగాల బారిన పడుతున్నారు. అత్యధికులు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో పలువురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. 30 ఏళ్లు దాటినవారిలోనూ వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అయిదు పదులు కూడా దాటకముందే పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. చెంచు పెంటల్లో ఎక్కడా ఆరోగ్య ఉప కేంద్రాలు లేవు. లింగాల, అమ్రాబాద్‌ మండలాల్లోని చెంచు పెంటలకు చెందిన గర్భిణులు కాన్పు కోసం ఆసుపత్రులకు వెళ్లాలంటే సుమారు 30 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు, సారా ప్రభావంతో పురుషుల ఆరోగ్యం క్షీణిస్తోంది.  సీజనల్‌ వ్యాధుల బారిన పడినప్పుడు నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ఆకుపసర్లు, వనమూలికలనే ఉపయోగిస్తున్నారు.

‘నైస్‌’ సంస్థ అండ..

పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చెంచులకు ‘నీడీ ఇల్లిటరేట్‌ చిల్డ్రన్‌ ఎడ్యుకేషన్‌’ (నైస్‌) స్వచ్ఛంద సంస్థ అండగా నిలుస్తోంది. లింగాల మండలం లోతట్టు అటవీ ప్రాంతంలోని ఎర్రపెంటను దత్తత తీసుకున్న సంస్థ.. అక్కడ నివాసం ఉంటున్న 102 చెంచు కుటుంబాలకు ప్రతి నెలా రూ.3,500 విలువైన నిత్యావసర సరకులను అందజేసేందుకు రూ.3 కోట్లతో కార్యాచరణ రూపొందించింది. ఆదివారం పంపిణీ ప్రారంభించింది. అయిదేళ్లపాటు ప్రతి నెలా ఒక్కో కుటుంబానికి రూ.3,500 విలువైన సరకులను పంపిణీ చేయనున్నారు. వీటిలో 26 కిలోల బియ్యంతో పాటు 11 రకాల నిత్యావసర సరకులు ఉంటాయి. దాతల సహకారంతో పౌష్టికాహారం అందజేయనున్నట్లు ‘నైస్‌’ వ్యవస్థాపక కార్యదర్శి పూర్ణచంద్రరావు తెలిపారు. ఆర్డీటీ సంస్థ సమన్వయంతో నల్లమల లోతట్టు ప్రాంతంలోని చెంచులకూ పౌష్టికాహారం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. చెంచులను మద్యపానానికి దూరం చేసేందుకూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని