చిన్నారెడ్డికి ‘ప్రజావాణి’ బాధ్యతలు

ప్రజావాణి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రారంభించిన ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

Published : 26 Feb 2024 04:39 IST

దరఖాస్తులపై సమీక్ష.. విభాగాల సమన్వయం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజావాణి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రారంభించిన ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమితులైన జి.చిన్నారెడ్డికి అదనంగా ప్రజావాణి బాధ్యతలను అప్పగిస్తూ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

3,96,224 దరఖాస్తుల పరిష్కారం..

ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఐఏఎస్‌ అధికారిని నోడల్‌ అధికారిగా నియమించింది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో ఐఏఎస్‌ అధికారి దివ్య సారథ్యంలో.. వివిధ విభాగాల అధికారులు అర్జీలను స్వీకరిస్తున్నారు. వారికి వెంటనే రసీదు ఇవ్వడంతో పాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నమోదు చేస్తున్నారు. జిల్లాస్థాయిలో పరిష్కరించే వాటిని కలెక్టర్లకు,  రాష్ట్రస్థాయివైతే సంబంధిత విభాగాలకు పంపిస్తున్నారు. నేరుగా ప్రజలతో ముడిపడి ఉన్నందున, ప్రజల బాగోగులు, క్షేత్రస్థాయిలో సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజావాణి కార్యక్రమం అత్యంత కీలకంగా మారింది. ఇటు రాష్ట్రస్థాయిలోనూ, అటు జిల్లాస్థాయిల్లోనూ కలెక్టర్లు, ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇంతవరకు ప్రజావాణి ద్వారా మొత్తం 4,90,825 దరఖాస్తులు నమోదు కాగా, అందులో 3,96,224 దరఖాస్తులను వివిధ దశల్లో పరిష్కరించారు. మరో 94,601 దరఖాస్తులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు వీలుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ప్రజావాణి దరఖాస్తులపై సమీక్ష నిర్వహించడంతో పాటు, అన్ని విభాగాలను సమన్వయం చేసే బాధ్యతలను చిన్నారెడ్డికి అప్పగించారు. ప్రజావాణిలో పాల్గొని, కార్యక్రమ అమలును చిన్నారెడ్డి ఇక నుంచీ పర్యవేక్షిస్తారు. అవసరమైతే సంబంధిత విభాగాల అధికారులతో ఏ వారానికి ఆ వారమే దరఖాస్తులపై సమీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. ఎప్పటికప్పుడు సమీక్ష చేయడం ద్వారా.. ప్రజావాణి దరఖాస్తుల్లో వీలైనన్ని వెంటవెంటనే పరిష్కరించడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దీర్ఘకాలికమైనవి, విధానపరమైన అంశాలకు సంబంధించిన దరఖాస్తులుంటే.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని