అసలే సిబ్బంది కొరత... ఆపై కొత్త బాధ్యతా?

రాష్ట్రంలో ఇంటింటికి మంచినీటి సరఫరా, నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీ(జీపీ)లకు అప్పగించారు.

Published : 26 Feb 2024 04:40 IST

పంచాయతీలకు మంచినీటి సరఫరా అప్పగింతపై కార్మికులు, గ్రామ కార్యదర్శుల ఆవేదన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటింటికి మంచినీటి సరఫరా, నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీ(జీపీ)లకు అప్పగించారు. సాధారణ విధులకే సిబ్బంది కొరత ఉండగా మంచినీటి నిర్వహణ తమకు ఇబ్బందికరంగా మారుతుందని కార్మికులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో 12,770 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 2018లో అమల్లోకి వచ్చిన కొత్త పంచాయతీరాజ్‌ చట్టం అనుసరించి ప్రతి అయిదు వందల జనాభాకు ఒకరు, 500 నుంచి వెయ్యి జనాభాకు ఇద్దరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 55,308 మంది బహుళవిధ(మల్టీపర్పస్‌) కార్మికులను ప్రభుత్వం నియమించింది. వారే పారిశుద్ధ్య కార్మికులు, ట్రాక్టర్‌ డ్రైవర్లు, కారోబార్లు, ఎలక్ట్రీషియన్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి గత మే నుంచి నెలకు రూ.9,500 చొప్పున పంచాయతీలే చెల్లిస్తున్నాయి. సరైన ఆదాయం లేకపోవడం, రాష్ట్ర కేంద్ర, ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు సకాలంలో విడుదల కాకపోవడంతో వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. గత మూడు నెలలుగా చెల్లించలేదు.

ఇతర పనులకు విఘాతం..

మిషన్‌ భగీరథ సిబ్బంది నిర్వర్తిస్తున్న మంచినీటి నిర్వహణ బాధ్యతలను తాజాగా పంచాయతీలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఉపరితల నీటి నిల్వ రిజర్వాయర్‌(ఓహెచ్‌ఎస్‌ఆర్‌)ల నుంచి ఇళ్లకు సరఫరా, క్లోరినేషన్‌, ట్యాంకుల శుభ్రం, కొత్త కనెక్షన్‌ల ఏర్పాటు, పైపులైన్ల మరమ్మతులు వంటి పనులు కార్మికులే నిర్వహించాలి. ఇవి చేస్తే పారిశుద్ధ్యం, ఇతర పనులకు విఘాతం కలుగుతుందని వారు వాపోతున్నారు. మరోవైపు కార్మికుల కొరత వల్ల తమపై భారం పడుతుందని గ్రామపంచాయతీ కార్యదర్శులు కలవరం చెందుతున్నారు.


అదనంగా సిబ్బందిని నియమించాలి

- శంకర్‌, పారిశుద్ధ్య కార్మిక సంఘం నేత

ప్రభుత్వం మంచినీటి నిర్వహణ బాధ్యతను పంచాయతీలకు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే ఈ భారం బహుళవిధ కార్మికులపై వేయొద్దు. ఇందుకోసం అదనంగా సిబ్బందిని నియమించాలి లేదా ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని