బస్సుల్లో వందశాతం దాటుతున్న ఓఆర్‌

ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. మహాలక్ష్మి పథకంతో ఈ రద్దీ మరింత పెరిగింది. ఈ పథకానికి ముందు బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తిని తెలిపే ఓఆర్‌ (ఆక్యుపెన్సీ రేషియో) 65-68 శాతం ఉంటే ఇప్పుడు తరచూ వంద శాతం దాటేస్తోంది.

Published : 26 Feb 2024 04:42 IST

పాతవాటినే మరమ్మతులతో నెట్టుకొస్తున్న ఆర్టీసీ

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. మహాలక్ష్మి పథకంతో ఈ రద్దీ మరింత పెరిగింది. ఈ పథకానికి ముందు బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తిని తెలిపే ఓఆర్‌ (ఆక్యుపెన్సీ రేషియో) 65-68 శాతం ఉంటే ఇప్పుడు తరచూ వంద శాతం దాటేస్తోంది. ఫిబ్రవరి 19వ తేదీన ఏకంగా 114.28 శాతం ఓఆర్‌ నమోదవ్వగా, 20న 108.38 శాతం నమోదైంది. గతంలో ఎనిమిది లక్షల కి.మీ దాటిన బస్సుల్ని తుక్కుగా మార్చేవారు. ఇప్పుడు 14-15 లక్షల కి.మీ దాటినా నడిపిస్తున్నారు. పాత బస్సులు పలుసార్లు బ్రేక్‌డౌన్లు అవుతున్నాయి. నిర్వహణ సమస్యలు సైతం అధికం కావడంతో మెకానిక్‌లు తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు.

కొత్తవి అరకొరే

పాత బస్సుల స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టడంతో పాటు పెరిగిన రద్దీకి తగ్గట్లు అదనపు బస్సులు పెంచాలి. అప్పుడప్పుడు కొత్త బస్సులు వస్తున్నా మొత్తం బస్సులతో పోలిస్తే వాటి సంఖ్య అరకొర మాత్రమే. ఆర్టీసీలో రాష్ట్రవ్యాప్తంగా అద్దె వాటితో కలిపి 9,200 బస్సులు ఉన్నాయి. వీటిలో ఐదు వేల బస్సులకు పైగా పాతవే. అద్దె బస్సులను ఒప్పందం ముగిశాక పక్కన పెడుతున్న ఆర్టీసీ సొంత బస్సులను మాత్రం ఆర్థిక ఇబ్బందుల కారణంగా మార్చలేకపోతోంది. ఇప్పటికే భారీ అప్పుల్లో ఉన్న ఆర్టీసీ అతి కష్టం మీద రూ.వెయ్యి కోట్ల రుణాల్ని తీసుకుంది. గతంతో పోలిస్తే ప్రయాణికులు పెరిగినా నేరుగా వచ్చే ఆదాయం రూ.450 కోట్ల నుంచి రూ.270 కోట్లకు తగ్గినట్లు సమాచారం. మహాలక్ష్మి పథకం ‘జీరో’ టికెట్ల కింద ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే అప్పు ఇచ్చే బ్యాంకులు మాత్రం ఆర్టీసీకి ప్రయాణికుల నుంచి నేరుగా వచ్చే ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాయన్న అభిప్రాయాలున్నాయి.

నిర్వహణపై నిక్కచ్చిగా ఉండాలి

బస్సుల బ్రేక్‌ సిస్టమ్‌ నిర్వహణ సక్రమంగా చేయాలంటూ ఆర్టీసీ యాజమాన్యం అధికారులకు ఇటీవల ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. నిర్వహణ నిర్లక్ష్యం కారణంగా కొన్ని డిపోల్లో జరిగిన ప్రమాదాలను దృష్టాంతంగా చూపింది. బ్రేక్‌ లైనర్ల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాల్ని ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ప్రమాదాల నిర్వహణ, ఆపద సమయంలో ఎలా స్పందించాలన్న విషయంపై డ్రైవర్లకు అవగాహన కల్పించాలని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని