పోలీసు శాఖలో బదిలీల గందరగోళం

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసుశాఖలో జరగబోతున్న బదిలీల పరంపర ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత మార్పుల ప్రక్రియ మొదలైంది.

Updated : 26 Feb 2024 19:56 IST

కొత్త ప్రభుత్వం వచ్చాక ఒకసారి
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మరోసారి
నిబంధనల్లో మార్పులతో ఇప్పుడు ఇంకోసారి..

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసుశాఖలో జరగబోతున్న బదిలీల పరంపర ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత మార్పుల ప్రక్రియ మొదలైంది. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల మార్గదర్శకాలు వెలువడటంతో దానికి అనుగుణంగా పెద్దఎత్తున మార్చారు. ఒకరిద్దరు మినహా రాష్ట్రవ్యాప్తంగా సీఐ నుంచి అదనపు ఎస్పీ వరకూ అంతా ఒక స్థానం నుంచి మరొక స్థానానికి బదిలీ అయ్యారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పోలీసు శాఖలో ఈ స్థాయిలో బదిలీలు జరగలేదు. కేంద్ర ఎన్నికల సంఘం మరోమారు ఈ నెల 23న జారీ చేసిన మార్గదర్శకాలలో బదిలీలకు పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని పేర్కొంది. దాంతో ఇటీవల బదిలీ అయిన అనేక మందికి స్థానచలనం తప్పకపోవచ్చు. సోమవారం మధ్యాహ్నానికి దీనిపై నివేదిక సమర్పించాల్సి ఉంది కాబట్టి ఏ క్షణమైనా మళ్లీ బదిలీలు జరిగే అవకాశం ఉంది.

తొలుత కేంద్ర ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన మార్గదర్శకాలలో ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు, రెవెన్యూ వంటి విభాగాలతోపాటు కొత్తగా ఆబ్కారీశాఖను కూడా దీని పరిధిలోకి తెచ్చింది. ఆయా శాఖల్లో గడిచిన నాలుగేళ్ల కాలంలో మూడేళ్లపాటు ఒకే రెవెన్యూ జిల్లాలో పనిచేస్తున్న వారందర్నీ మార్చాలని పేర్కొంది. ఆ ప్రకారం రాష్ట్ర పోలీసుశాఖలో దాదాపు 400 మందికిపైగా అధికారులు బదిలీ అయ్యారు. ఇంతమందిని ఒకేసారి మార్చడంతో కొంత గందరగోళం నెలకొంది. కొంతమంది అధికారులు కొత్త స్థానాల్లో బాధ్యతలు చేపట్టిన వెంటనే మళ్లీ మార్చగా మరికొందర్ని అసలు బదిలీ ఆదేశాలు అందుకోకముందే మార్చారు. ఈ నెల 23న ఎన్నికల కమిషన్‌ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం తాజాగా బదిలీ అయిన వారిలో అనేక మందిని మళ్లీ మార్చాల్సి వస్తుంది. ఉదాహరణకు ఇంతక్రితం రంగారెడ్డి జిల్లాలో పనిచేసిన వారిని మేడ్చల్‌ జిల్లాకు బదిలీ చేశారు. ఈ రెండూ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకే వస్తాయి. తాజా మార్గదర్శకాల ప్రకారం ఇలా బదిలీ అయిన వారందర్నీ మార్చాల్సి ఉంటుంది. కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రెండు, మూడు జిల్లాలు ఉన్నాయి. మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో ఇంకా ఎక్కువ ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని