ఖర్చు రెండింతలైనా నాణ్యత నామమాత్రం

పెద్దపులుల కోసం ఖాళీ కానున్న రెండు గ్రామాల ప్రజలకు చేపడుతున్న పునరావాస పనులకు ఏకంగా 11 ఏళ్లు పట్టింది. ఆలస్యంతో ఇళ్ల నిర్మాణ వ్యయం రెండింతలు దాటింది. ఇంత ఖర్చుచేసినా నిర్మాణ పనుల్లో నాణ్యత లేదు.

Published : 26 Feb 2024 04:44 IST

కవ్వాల్‌ పునరావాస కాలనీలో ఇళ్ల గోడలకు పగుళ్లు
పెద్ద పులుల కోసం గ్రామాలు ఖాళీ చేయాలని 11 ఏళ్ల క్రితం నిర్ణయం
ఎట్టకేలకు తుది దశకు చేరిన ప్రక్రియ

ఈనాడు, హైదరాబాద్‌-న్యూస్‌టుడే, కడెం: పెద్దపులుల కోసం ఖాళీ కానున్న రెండు గ్రామాల ప్రజలకు చేపడుతున్న పునరావాస పనులకు ఏకంగా 11 ఏళ్లు పట్టింది. ఆలస్యంతో ఇళ్ల నిర్మాణ వ్యయం రెండింతలు దాటింది. ఇంత ఖర్చుచేసినా నిర్మాణ పనుల్లో నాణ్యత లేదు. విపరీత జాప్యంతో పరిహారం అందుకోకుండానే ఐదుగురు మరణించారు. మరోవైపు గడిచిన రెండు, మూడేళ్లలో కొందరు పరిహారానికి అర్హులైనా వారిని జాబితాలో చేర్చేందుకు అటవీశాఖ నిరాకరిస్తోంది.

పులుల కోసం జనసంచారం లేకుండా

కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు కోర్‌ ఏరియాలో జనసంచారంతో పులులు స్థిరపడట్లేదు. కోర్‌లోని మొత్తం 37 గ్రామాల్లో స్వచ్ఛందంగా ముందుకువచ్చిన గ్రామాల్ని ఖాళీ చేయించాలని అటవీశాఖ 2013లో నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్టుగా నిర్మల్‌ జిల్లా కడెం మండలంలోని మైసంపేట, రాంపూర్‌ గ్రామాల్లోని 142 కుటుంబాల్ని తరలించే ప్రక్రియ తుది దశకు చేరింది. ఆప్షన్‌-1 తీసుకున్నది 48 కుటుంబాలు. వీరు రూ.15 లక్షల నగదు పరిహారం ఎంచుకున్నారు. ఆప్షన్‌-2లో 94 కుటుంబాలున్నాయి. వీరికి ఇల్లు కట్టించి ఇవ్వడం, సామాజిక భవనాలు నిర్మించి ఇవ్వడంతోపాటు ఒక్కో కుటుంబానికి 2.81 ఎకరాల భూమి (1.14 హెక్టార్లు) ఇస్తామని అటవీశాఖ పేర్కొంది. పునరావాస ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి తొలుత రూ.4.5 లక్షల ఖర్చుగా అంచనా వేశారు. తర్వాత రూ.7 లక్షలు, ఆ తర్వాత పెరిగి దాదాపు రూ.11 లక్షల ఖర్చయ్యింది. త్వరలో వీరిని ఆ గ్రామాల నుంచి ధర్మాజిపేట పునరావాస కాలనీకి తరలించేందుకు అధికారులు ఏర్పాటుచేస్తున్నారు.

  • ఇళ్ల లోపల ఒక్క షెల్ఫ్‌ కూడా లేదు. అక్కడక్కడా గోడలపై పగుళ్లు కన్పిస్తున్నాయి. కిటికీలు, తలుపులు నాసిరకంగా ఉన్నాయి. గడపకు మెట్లు నిర్మించాలని.. కాలనీలో కేవలం మిషన్‌ భగీరథ నల్లాలే సరిపోవని చేతి పంపులు వేయాలంటూ గిరిజనులు సమస్యల్ని ఏకరువు పెడుతున్నారు.
  • కవ్వాల్‌ కోర్‌ ఏరియాలోకి దారితీసే మార్గంలో ప్రస్తుతం 9 పులులున్నాయి. ఇందులో ఐదు పెద్దవి.

భూముల కేటాయింపుపై కొత్త డిమాండ్లు

పునరావాస గ్రామాల వారికి ధర్మాజిపేట వద్ద మొత్తం 264.14 ఎకరాల భూమిస్తామని అటవీశాఖ పేర్కొంటోంది. అయితే ధర్మాజిపేట గ్రామానికి సమీపంలోనే ఉన్న నచ్చన్‌ ఎల్లాపూర్‌, పెత్తూర్‌పూర్‌ వాసులు తమకూ సాగుభూమి ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో పోడు సాగు చేస్తే అటవీశాఖ కేసులు పెట్టిందని.. ఇప్పుడు మాకు సాగు భూమి ఇచ్చాకే పునరావాస గ్రామాల వారికి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని