ఎల్‌ఆర్‌‘ఎస్‌’.. దరఖాస్తులు పరిష్కరించాలని సీఎం ఆదేశం

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారుల ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించనున్నాయి. ఈ దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 27 Feb 2024 06:49 IST

మార్చి 31లోగా లేఅవుట్ల క్రమబద్ధీకరణకు నిర్ణయం
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన అర్జీలు 25.44 లక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారుల ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించనున్నాయి. ఈ దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 31వ తేదీలోగా లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) కింద స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం అధికారులను ఆదేశించారు. దీంతో మూడున్నరేళ్లుగా పెండింగులో ఉన్న దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో కదలిక రానుంది.

2020 ఆగస్టు 31న ఉత్తర్వులు..

అనుమతిలేని లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వం అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ రూల్స్‌-2020 పేరిట 2020 ఆగస్టు 31వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు అదే ఏడాది సెప్టెంబరు 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ప్లాట్లు కొనుగోలు చేసినవారు దరఖాస్తుతోపాటు రూ.వెయ్యి, లేఅవుట్‌ వేసిన డెవలపర్‌ దరఖాస్తు చేసిన పక్షంలో రూ.10 వేలు ఫీజుగా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 25.44 లక్షల దరఖాస్తులు అందాయి. మున్సిపల్‌ కార్పొరేషన్లలో 4.13 లక్షలు, మున్సిపాలిటీల్లో 10.55 లక్షలు, పంచాయతీల్లో 10.76 లక్షల అర్జీలు వచ్చాయి. అధికారులు పరిష్కార ప్రక్రియ చేపట్టేలోగా హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, న్యాయస్థానం తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని అఫిడవిట్‌ ఇచ్చిన దరఖాస్తులను పరిష్కరించవచ్చని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. సుమారు 4 వేల మంది దరఖాస్తుదారులు స్వచ్ఛందంగా ముందుకు రావటంతో వారికి అధికారులు అనుమతులు జారీచేశారు. అఫిడవిట్‌ ఇచ్చిన దరఖాస్తుదారుల్లో సుమారు 20 శాతం మందికి ఇళ్ల నిర్మాణానికి అధికారులు అనుమతులు జారీ చేశారు.

ప్రభుత్వ స్థలాల్లోని లేఅవుట్లతోపాటు దేవాదాయశాఖ, వక్ఫ్‌, చెరువు గర్భం, కోర్టు కేసుల్లో ఉన్న భూముల్లో వేసిన లేఅవుట్లను క్రమబద్ధీకరించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయి పరిశీలన తరవాత సుమారు 20 శాతం దరఖాస్తులు అర్హమైనవి కావని అధికారులు గుర్తించారు. ఎల్‌ఆర్‌ఎస్‌  దరఖాస్తులను పరిష్కరించాల్సిందిగా తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం స్వయంగా ఆదేశించడంతో విధివిధానాల రూపకల్పనకు అధికారులు కసరత్తు చేయనున్నారు.


సర్కారుకు రూ.8 వేల కోట్లకు పైగా ఆదాయం!

ల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారం ద్వారా వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.6 వేల కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హెచ్‌ఎండీఏ, మున్సిపల్‌ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలకు రూ.4 వేల కోట్లు, పంచాయతీలకు రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. లేఅవుట్ల క్రమబద్ధీకరణతో ప్లాట్ల క్రయవిక్రయాలు ముమ్మరంగా సాగుతాయని.. తద్వారా మరో రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని