పకడ్బందీగా పన్ను వసూళ్లు

రాష్ట్రంలో నిర్దేశిత లక్ష్యం మేరకు పన్ను వసూళ్లు సాధించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Published : 27 Feb 2024 05:12 IST

త్వరలో సమగ్ర ఇసుక విధానం
వాహనాలకు ట్రాకింగ్‌ వ్యవస్థ
ఆదాయ వనరుల విభాగాల సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్దేశిత లక్ష్యం మేరకు పన్ను వసూళ్లు సాధించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇసుక విక్రయాల కోసం సమగ్ర విధానం రూపొందించాలని, అక్రమ రవాణాకు అవకాశాల్లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల నుంచి నాన్‌డ్యూటీ పెయిడ్‌ మద్యం రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాలన్నారు. మద్యం సరఫరా, విక్రయాలకు సంబంధించిన గణాంకాల్లో తేడాలున్నాయని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టంచేశారు. టీఎస్‌ఎండీసీతో పాటు గనులశాఖలో ఒకే పోస్టులో ఏళ్లతరబడి తిష్ఠవేసిన, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను వెంటనే బదిలీ చేయాలని ఆదేశించారు. 2023-24 ఏడాదికి వాణిజ్యపన్నులు, ఆబ్కారీ, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనులు, భూగర్భ వనరులశాఖ పన్ను వసూళ్లపై సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల ఆదాయ లక్ష్యాలు, మార్గాలు, పన్ను వసూళ్లు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్సైజ్‌ విభాగంలో అక్రమాలు అరికట్టి పూర్తిస్థాయి పన్ను వసూళ్లకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

డిస్టిలరీల వద్ద సీసీ కెమెరాలు...

‘‘రాష్ట్రంలోని డిస్టిలరీల వద్ద సీసీ కెమెరాలతో పాటు, మద్యం సరఫరా వాహనాలకు జీపీఎస్‌ అమర్చి వాటిని ట్రాకింగ్‌ చేయాలి. ఈ సీసీ కెమెరాలను కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేయాలి. బాట్లింగ్‌ ట్రాకింగ్‌, మద్యం సరఫరా వాహనాల వే బిల్లులు కచ్చితంగా ఉండాలి. నాన్‌డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌తో పాటు గతంలో నమోదుచేసిన కేసుల పురోగతిపై నివేదిక అందజేయాలి. హైదరాబాద్‌తో పాటు నగరాల్లోని రహదారులపై కంకర కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారు. దీనికోసం వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాలను వినియోగించుకోవాలి. ఇసుక సరఫరా వాహనాలనూ ట్రాక్‌ చేయాలి.  నిబంధనలు ఉల్లంఘించిన గనులపై విధించిన జరిమానాలు వెంటనే వసూలు చేయాలి’’ అని సీఎం తెలిపారు.

కార్యాలయాలకు సొంత భవనాలు..

వాణిజ్యపన్నుల శాఖలో పన్ను లక్ష్యానికి, రాబడికి మధ్య వ్యత్యాసం ఎందుకు ఎక్కువగా ఉందని సీఎం ప్రశ్నించగా... గతేడాది వరకు కేంద్రం జీఎస్టీ పరిహారం కింద రూ.4 వేల కోట్లు ఇచ్చేదని, ఇప్పుడు గడువు ముగియడంతో ఆ నిధులు రాకపోవడంతో రాబడిలో వ్యత్యాసం కనిపిస్తోందని అధికారులు వివరించారు. కార్యాలయాలు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయని వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ టి.కె.శ్రీదేవి సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఆదాయాన్నిచ్చే శాఖలకు సొంతభవనాలు లేకపోవడం సరికాదన్న సీఎం.. వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆయాశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని