300 ఎకరాల్లో జీనోమ్‌ వ్యాలీ రెండోదశ

త్వరలోనే హైదరాబాద్‌లో జీనోమ్‌ వ్యాలీ రెండోదశను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 300 ఎకరాల్లో రూ.2 వేల కోట్ల పెట్టుబడులతో రెండోదశ జీనోమ్‌ వ్యాలీని నెలకొల్పనున్నామని, రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో పది ఫార్మా విలేజీలను ఏర్పాటు చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైందని సీఎం తెలిపారు.

Published : 28 Feb 2024 08:16 IST

వికారాబాద్‌, మెదక్‌, నల్గొండ జిల్లాల్లో గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్లు
రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో 5 లక్షల మందికి ఉద్యోగాలు
బయో ఏషియా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఈనాడు- హైదరాబాద్‌: త్వరలోనే హైదరాబాద్‌లో జీనోమ్‌ వ్యాలీ రెండోదశను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 300 ఎకరాల్లో రూ.2 వేల కోట్ల పెట్టుబడులతో రెండోదశ జీనోమ్‌ వ్యాలీని నెలకొల్పనున్నామని, రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో పది ఫార్మా విలేజీలను ఏర్పాటు చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైందని సీఎం తెలిపారు. దీని ద్వారా మౌలిక సదుపాయాలతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలొస్తాయని, 5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయన్నారు. హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తున్న బయో ఏషియా 2024 సదస్సును మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించి ప్రసంగించారు. వికారాబాద్‌, మెదక్‌, నల్గొండ జిల్లాల్లో గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్లలో ఫార్మా విలేజ్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒక గంట ప్రయాణ దూరంలోనే వీటిని ఏర్పాటు చేస్తున్నందున.. ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలందరికీ ఎంతో సదుపాయంగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. సదస్సు సందర్భంగా అంకుర సంస్థలు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సీఎం సందర్శించారు. ఈ ఏడాది జీనోమ్‌ వ్యాలీ ఎక్సలెన్స్‌ పురస్కారానికి ఎంపికైన నోబెల్‌ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ గ్రెగ్‌ ఎల్‌. సెమెంజాను సీఎం అభినందించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. సెమెంజాకు అవార్డును అందజేశారు.

జీవ వైద్యశాస్త్ర రాజధాని హైదరాబాద్‌

సీఎం మాట్లాడుతూ.. ‘కొవిడ్‌ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో జీవ వైద్యశాస్త్ర రాజధానిగా హైదరాబాద్‌ యావత్‌ మానవాళికి భరోసాగా నిలిచింది. వైరస్‌ భయాలను దీటుగా ఎదుర్కోగలమనే నమ్మకాన్ని కలిగించింది. ప్రపంచంలో వినియోగించే ప్రతి మూడు వ్యాక్సిన్లలో ఒకటి హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతోంది. ఏటా 5 కోట్ల డోసుల వ్యాక్సిన్ల ఉత్పత్తే లక్ష్యంగా ప్రఖ్యాత తకేడా సంస్థ బయలాజికల్‌-ఇ సంస్థతో కలిసి హైదరాబాద్‌లో తయారీ కేంద్రం నెలకొల్పాలన్న ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం. జర్మనీకి చెందిన మిల్టెని సంస్థ తన రీసెర్చ్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. జీవ వైద్యశాస్త్రంలోనే కాదు.. ఐటీ, సాఫ్ట్‌వేర్‌, రీసెర్చ్‌, స్టార్టప్‌ రంగాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను మరింత సమున్నతంగా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. చిన్న స్టార్టప్‌లు, పెద్ద కార్పొరేట్‌ కంపెనీలకు వారధిగా నిలిచే ఎంఎస్‌ఎంఈ రంగానికి మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. మీరు నింగిలోని తారల వద్దకు చేరాలని కలలు కంటే.. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లే రాకెట్‌లా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇటీవల దావోస్‌ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు భారీస్థాయిలో రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి’ అని తెలిపారు.

ద్వితీయశ్రేణి పట్టణాలూ అనుకూలమే

సదస్సు సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డితో పలుసంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు. తెలంగాణ భౌగోళిక స్థితిగతులు, ఇతర అంశాలను సీఎం వారికి వివరించారు. పెట్టుబడులకు తెలంగాణ ఎంతో అనుకూలమని, హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ నాయకత్వ చొరవ కారణంగానే హైదరాబాద్‌లో ఫార్మా రంగం విస్తరించిందని, శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లడానికైనా గంటన్నర సమయం సరిపోతుందన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు. వచ్చే మూడేళ్లలో ప్రాంతీయ రింగ్‌రోడ్డు పూర్తి చేస్తామన్నారు.

పెట్టుబడులకు పలు కంపెనీల సంసిద్ధత

తెలంగాణ జీవ వైద్యశాస్త్ర రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయి. హెల్త్‌ కేర్‌ రంగంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా రాష్ట్ర మంత్రి శాండర్సన్‌ తెలిపారు. భారతదేశంలో తొలి వాణిజ్య కార్యాలయాన్ని హైదరాబాద్‌లోనే ప్రారంభిస్తున్నట్లు ఆమె సీఎంకు వివరించారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఎండీ జెర్మీ జూర్గన్స్‌ కూడా సీఎంతో సమావేశమయ్యారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం వారికి సూచించారు. ప్రధానంగా వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని, తెలంగాణలో 26 రకాల పంటలను పండించగలిగే భూములున్నాయని వివరించారు. ఆర్గానిక్‌ ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి డిమాండ్‌ ఉందన్నారు. రాష్ట్రంలో డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ను తయారు చేస్తున్నట్లు జెర్మీ జూర్గన్స్‌కు సీఎం తెలిపారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ రంగంలో పెట్టుబడులు పెట్టాలని తనను కలిసిన బెల్జియం అంబాసిడర్‌ డెడిర్‌ వాండర్‌ హసక్‌కు రేవంత్‌రెడ్డి సూచించారు. సెమీకండక్టర్‌ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి మరికొందరు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు.


వ్యాధి మూలాలను గుర్తిస్తే.. చవకగా మెరుగైన వైద్యం

నోబెల్‌ బహుమతి గ్రహీత సెమెంజా

ఈనాడు, హైదరాబాద్‌: వ్యాధుల మూలాలను గుర్తించి చికిత్స విధానాలను అభివృద్ధి చేయడం ద్వారా తక్కువ ఖర్చుతోనే అందరికీ మెరుగైన వైద్యం అందుబాటులోకి తేవచ్చని ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత ప్రొఫెసర్‌ గ్రెగ్‌ సెమెంజా తెలిపారు. బయో ఏషియా సదస్సులో ఆయన మంగళవారం కీలకోపన్యాసం చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘మూలకణాల చికిత్స సంబంధిత మందులను అభివృద్ధి చేయడం ద్వారా సత్ఫలితాలొస్తాయి. శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్‌ అందే విధానంపై సమగ్ర అధ్యయనం చేయడం ద్వారా వచ్చే ఫలితాలు క్యాన్సర్‌ వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగపడతాయి. కణంలోని మైటోకాండ్రియా శక్తిని ఉత్పత్తి చేసేందుకు వీలుగా శరీరంలోని 50 ట్రిలియన్ల కణాలు ప్రతి క్షణం అవసరమైన ఆక్సిజన్‌ను తీసుకుంటాయి. మన శరీర వ్యవస్థలో ఊపిరితిత్తులు, శ్వాస, రక్త ప్రసరణ వ్యవస్థ.. మన కణాలకు ఆక్సిజన్‌ను చేరవేసే పనిని నిర్వర్తిస్తుంటాయి. అది తగినంతగా అందనపుడు శ్వాస, రక్త ప్రసరణ వ్యవస్థలో అవసరమైన మార్పులు చేసి ఆక్సిజన్‌ కణాలకు అందేలా చేయాలి. మూత్రపిండాలు ఎరిత్రోప్రొటీన్‌ లేదా ఈపీవో అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఎముకలోని మూలుగుకు చేరుకుని.. ఎర్రరక్త కణాల ఉత్పత్తిని పెంచేలా దోహదపడుతుంది. ఎర్ర రక్తకణాలు శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి. కిడ్నీలోని కణాలు, ఆక్సిజన్‌ లభ్యత, ఈపీవో ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆక్సిజన్‌ లేదా హైపోక్సియాను తగ్గించడానికి ఎలా స్పందిస్తాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. మొదట మానవ జన్యువులో ఒక క్రమాన్ని గుర్తించాం. దీని ద్వారా హైపోక్సిక్‌ కణాల్లో ఉన్న ప్రొటీన్‌ను గుర్తించడానికి మేం ఈపీవో క్రమాన్ని ఉపయోగించాం. ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని నియంత్రించడం కోసం.. ఈపీవో ద్వారా ప్రయోజనకరమైన విధానాన్ని అందుబాటులోకి తెచ్చాం. ఫలితంగా చికిత్స విధానంలో మార్పులకు అవకాశం కలిగింది. దీర్ఘకాలికంగా మూత్రపిండాల వ్యాధి ఉన్న వారిలో ఈపీవో ఉత్పత్తి లోపం ఎక్కువగా ఉంటుంది. 1986కి ముందు.. ఇలాంటి రోగులకు ఎర్ర రక్తకణాలను ఎక్కించాల్సి వచ్చేది. దానివల్ల ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఉండేది. ఇప్పుడు కొత్త చికిత్స విధానం అందుబాటులోకి రావడం చాలా ఉపయోగపడుతోంది. ఇదే విధానం క్యాన్సర్‌ చికిత్సలోనూ సత్ఫలితాలనిస్తుంది’ అని సెమెంజా వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని