అమలు గ్యారంటీ

అభయహస్తం గ్యారంటీల్లోని మరో రెండు హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘గృహజ్యోతి’లోని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ‘మహాలక్ష్మి’లోని రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో మంగళవారం ప్రారంభించారు.

Published : 28 Feb 2024 08:15 IST

ఆర్థిక సంక్షోభమున్నా ఆ హామీలు నెరవేర్చి తీరుతాం
సంక్షేమంలో దేశానికి నమూనాగా తెలంగాణ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
200 యూనిట్ల విద్యుత్తు, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలకు శ్రీకారం

ఈనాడు, హైదరాబాద్‌: అభయహస్తం గ్యారంటీల్లోని మరో రెండు హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘గృహజ్యోతి’లోని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ‘మహాలక్ష్మి’లోని రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో మంగళవారం ప్రారంభించారు. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నా ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టంచేశారు. సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తామని, దేశానికి నమూనాగా మారుస్తామని పేర్కొన్నారు. మహిళల కళ్లల్లో ఆనందం చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి లబ్ధిదారులకు సులభంగా అందేలా ఈ పథకాల్ని రూపొందించామని చెప్పారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఇచ్చిన హామీల్ని తమ ప్రభుత్వం అమలుచేసి తీరుతుందన్నారు. ‘‘సెప్టెంబరు 17న తుక్కుగూడ సభలో ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇస్తున్నట్లు ప్రకటించారు. సోనియా ఇచ్చిన మాట శిలాశాసనం. సువర్ణాక్షరాలతో లిఖించేలా వీటిని తూచా తప్పకుండా అమలుచేసి తీరుతాం. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి క్రమపద్ధతిలో నిధులు కేటాయిస్తున్నాం.

వారిని ప్రజలు విశ్వసించట్లేదు

కాంగ్రెస్‌ హామీలు అమలు కాకపోతే బాగుంటుందని తండ్రీకుమారులు.. మామాఅల్లుళ్లు కోరుకుంటున్నారు. భారాస నేతల తప్పుడు ప్రచారాలను ప్రజలు విశ్వసించడం లేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధరను మోదీ ప్రభుత్వం రూ.1,200 వరకు తీసుకెళ్లింది. నాడు రాష్ట్రంలో ఉన్న కేసీఆర్‌ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రజలపై భారాన్ని తగ్గించే ప్రయత్నం చేయలేదు. చేవెళ్లలో లక్ష మంది మహిళలతో ప్రియాంకా గాంధీ సమక్షంలో ఈ రెండు పథకాలను ప్రారంభించాలని అనుకున్నాం. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా సచివాలయంలో నిర్వహించాల్సి వచ్చింది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.

వారికి మార్చిలో ‘జీరో’ కరెంట్‌ బిల్లు: భట్టి

ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ఈ నెలలో 200 యూనిట్ల వరకు విద్యుత్తు వాడే అర్హులకు మార్చిలో ‘జీరో’ బిల్లు వస్తుందని చెప్పారు. ‘‘ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితిలో బ్యాంకుల నుంచి ఓవర్‌డ్రాఫ్ట్‌ తీసుకోవాల్సిన పరిస్థితుల్ని గత ప్రభుత్వం కల్పించింది. ఎన్ని ఒడుదొడుకులున్నా దృఢసంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులం ఆరు గ్యారంటీల అమలుకు కృషి చేస్తున్నాం. రూ.500కే గ్యాస్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాలను ప్రారంభించిన ఈరోజు చరిత్రాత్మకం.  లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ.  సాంకేతిక కారణాలతో ఎంపిక కానివారు మండల కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేయాలి’’ అని భట్టి సూచించారు.

మున్ముందు రూ.500 కడితే చాలు: ఉత్తమ్‌

ప్రస్తుత విధానంలో లబ్ధిదారు సిలిండర్‌పై మొత్తం ధర చెల్లిస్తే తర్వాత సబ్సిడీ మొత్తం వారి ఖాతాలో పడుతుందని.. రానున్న రోజుల్లో రూ.500 మాత్రమే చెల్లించి సిలిండర్‌ తీసుకునే విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం గ్యాస్‌ పథకాన్ని దాదాపు 40 లక్షల మంది లబ్ధిదారులతో ప్రారంభిస్తున్నా.. రానున్న రోజుల్లో అర్హులందరికీ వర్తింపజేస్తామని తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. మిగిలిన గ్యారంటీలనూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసి తీరుతుందని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా గృహజ్యోతి ‘జీరో’ విద్యుత్తు బిల్లు, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, పలువురు ఎమ్మెల్యేలు, సీఎస్‌ శాంతికుమారి, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి డీఎస్‌ చౌహాన్‌, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వి, దక్షిణ డిస్కం సీఎండీ ముషారఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని