గొర్రెల్లోనే కాదు.. ఆవుల్లోనూ మేశారు!

గొర్రెల పంపిణీ పథకంలో నిధులు పక్కదారి పట్టించిన వ్యవహారంపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆవుల పంపిణీలోనూ ఇదే తరహా మోసం వెలుగులోకి వచ్చింది.

Published : 28 Feb 2024 03:36 IST

సుమారు రూ.3 కోట్లు పక్కదారి
పుంగనూరు సరఫరాదారులను నట్టేట ముంచిన ముఠా
ప్రజాప్రతినిధిని వేడుకున్నా దక్కని ఫలితం
తాజాగా ఫిర్యాదు చేసేందుకు రావడంతో వెలుగులోకి..

ఈనాడు, హైదరాబాద్‌: గొర్రెల పంపిణీ పథకంలో నిధులు పక్కదారి పట్టించిన వ్యవహారంపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆవుల పంపిణీలోనూ ఇదే తరహా మోసం వెలుగులోకి వచ్చింది. గొర్రెల పంపిణీకి సంబంధించి రూ.2.01 కోట్ల నిధులు పక్కదారిపట్టడంపై దర్యాప్తు ప్రారంభించిన అవినీతి నిరోధక శాఖ(అనిశా) ఇప్పటికే నలుగురు అధికారులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఆవుల సరఫరా బాధితులు అనిశా అధికారులను కలిసి ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ ప్రకారం గొర్రెల పథకంలో నిధులు మళ్లించిన ముఠా.. ఈ పథకంలోనూ సుమారు రూ.3 కోట్ల మేర దారి మళ్లించినట్టు తెలుస్తోంది.

రంగారెడ్డి, కరీంనగర్‌, సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, పెద్దపల్లి, జగిత్యాల తదితర జిల్లాల రైతులకు ఆవులను పంపిణీ చేసేందుకు 2022 జనవరిలో అప్పటి రాష్ట్ర సర్కారు సంకల్పించింది. అధికారులు ఒక్కో యూనిట్‌కు రూ.70 వేల చొప్పున ధర నిర్ణయించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు ఆవులకు ప్రసిద్ధి కావడంతో తెలంగాణ పశుసంవర్ధక శాఖ అధికారులు అక్కడి సరఫరాదారులను ఆశ్రయించారు. 12 మంది నుంచి సుమారు 1200 యూనిట్లు కొనుగోలు చేశారు. అందుకుగానూ సుమారు రూ.8.5 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.

బినామీ ఖాతాల్లోకి నిధుల మళ్లింపు

సరఫరా పూర్తయి నెలలు దాటినా రూ.4 కోట్లు మాత్రమే తమ ఖాతాల్లో జమ కావడంతో 2022 మార్చిలో ఆవుల సరఫరాదారులు హైదరాబాద్‌ వచ్చి వాకబు చేశారు. వాస్తవానికి 12 మంది సరఫరాదారుల ఖాతాల్లో డబ్బు జమ కావాల్సి ఉండగా, అధికారుల సహకారంతో కొందరు అక్రమార్కులు ఇతర ఖాతాలకు నిధులు మళ్లించినట్టు తెలుసుకున్నారు. స.హ.చట్టం కింద దరఖాస్తు చేశారు. సంబంధం లేని ఖాతాలకు సుమారు రూ.4.50 కోట్లు మళ్లినట్టు నిర్ధారించుకున్నారు. ఆ ఆధారాలతో అధికారులు సహా దీనితో సంబంధం ఉన్న ముఠా సభ్యులను నిలదీశారు. దీంతో కంగుతిన్న వారు ఒకసారి రూ.1.05 కోట్లు, మరో దఫా రూ.40 లక్షలు బాధితులకు ముట్టజెప్పారు.

అక్కడి నేత.. ఇక్కడి నేత స్పందించకపోవడంతో..

మిగిలిన సుమారు రూ.3 కోట్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తుండటంతో బాధితులు పుంగనూరుకు చెందిన కీలక ప్రజాప్రతినిధిని ఆశ్రయించారు. ఆయన వ్యవహారాన్ని తెలంగాణలో సంబంధిత వ్యవహారాలు చూసే ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లినట్టు.. సొమ్ము తిరిగి ఇప్పించాల్సిందిగా కోరినట్టు తెలిసింది. ఒకట్రెండు సార్లు స్పందించిన ఇక్కడి ప్రజాప్రతినిధి తర్వాత పట్టించుకోకపోవడం, పైపెచ్చు ముఠా సభ్యులు బెదిరింపులకు తెగబడటం, ఉన్నతాధికారులకు లేఖల ద్వారా ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేకపోవడంతో బాధితులు అనిశాను ఆశ్రయించారు.

ముఠా దెబ్బకు.. బతుకులు ఆగం

ముఠా దెబ్బకు తమ కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారిందని పుంగనూరుకు చెందిన సరఫరాదారులు వాపోతున్నారు. ‘తెలంగాణ పశుసంవర్ధక శాఖ అధికారులే నేరుగా రావడంతో పలువురి నుంచి ఆవుల్ని సమీకరించాం. సుమారు రూ.3 కోట్లు బకాయిలు రాకపోవడంతో ఆవులు ఇచ్చిన వారు మాపై ఒత్తిడి తెచ్చారు. ఒత్తిళ్లు తట్టుకోలేక తామంతా పొరుగు రాష్ట్రాలకు పారిపోయి తలదాచుకుంటున్నాం’ అని కొందరు బాధితులు దర్యాప్తు అధికారుల ఎదుట కన్నీళ్లుపెట్టుకున్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని