నేడే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీకి రంగం సిద్ధమైంది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం తన నివాసంలో విడుదల చేయనున్నారు.

Updated : 29 Feb 2024 06:47 IST

11,062 పోస్టులకు విడుదల
మే లేదా జూన్‌లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు
2023 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీకి రంగం సిద్ధమైంది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం తన నివాసంలో విడుదల చేయనున్నారు. వీటిలో స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల గడువు, నియమ నిబంధనలు వెల్లడించనున్నారు. మే లేదా జూన్‌ నెలలో 10 రోజులపాటు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కొత్త నోటిఫికేషన్‌కు నిర్ణయించిన ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటన రద్దుకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్రంగా మరో కొత్త నోటిఫికేషన్‌ జారీ చేస్తామని అందులో పేర్కొంది. పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని.. కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలని..

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించింది. దీనికి అనుగుణంగా వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉండేలా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలనే సీఎం ఆదేశాలకు అనుగుణంగా విద్యాశాఖ గత మూడు వారాలుగా కసరత్తు చేసి నోటిఫికేషన్‌ సిద్ధం చేసింది. గతేడాది విడుదల చేసిన నోటిఫికేషన్‌కు 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అది జరగలేదు. ప్రభుత్వం మారినందున మరిన్ని పోస్టులను కలిపి నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు పాత ప్రకటనను రద్దు చేసింది. నాటి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌ తయారు చేయించారు. పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రశ్నపత్రాలు మొదలు ఫలితాల వరకూ సాంకేతికతను వినియోగించేలా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. పరీక్షను ఎంసెట్‌ తరహాలో నిర్వహించనున్నారని తెలుస్తోంది.

మళ్లీ బడిబాట

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను పెద్దఎత్తున చేర్చేందుకు వీలుగా బడిబాట కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూలును త్వరలో వెలువరించనున్నారు. డీఎస్సీతో ఉపాధ్యాయుల కొరత తీరనున్నందున విద్యార్థులను పెద్దఎత్తున చేర్చడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కళకళలాడుతాయని సర్కారు భావిస్తోంది. జాతీయ సగటు మేరకు ప్రతి 17 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. రాష్ట్రంలో ప్రస్తుతం కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నిర్ణీత పరిమితి కంటే తక్కువగా ఉంది. దీంతో విద్యార్థులను దామాషాకు అనుగుణంగా పెంచేందుకు ప్రభుత్వం దిశానిర్దేశనం చేయనుంది.

మౌలిక వసతులపై నివేదిక

పాఠశాలలకు ఏయే వసతులు కావాలనే దానిపై విద్యాశాఖ సమాచారం సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. పాఠశాలల్లో సమస్యలు, ఇతర అంశాలపై ఎంఈవోలు, డీఈవోల ద్వారా సమాచారం తీసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం దీనిపై నిర్వహించాల్సిన సమీక్ష సమావేశం వాయిదా పడింది. గురువారం లేదా మరో రోజు జరిగే సమీక్షలో మౌలిక వసతులకు సంబంధించి సీఎం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని