చిన్న కాళేశ్వరంపై ప్రభుత్వం దృష్టి

గత నాలుగేళ్లుగా ఎలాంటి పనులు జరగకుండా అర్ధాంతరంగా నిలిచిపోయిన చిన్న కాళేశ్వరం(ముక్తేశ్వరం) ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

Updated : 29 Feb 2024 08:30 IST

పునరుద్ధరణ అవకాశాలపై అధికారులతో మంత్రి ఉత్తమ్‌ చర్చలు
పది రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: గత నాలుగేళ్లుగా ఎలాంటి పనులు జరగకుండా అర్ధాంతరంగా నిలిచిపోయిన చిన్న కాళేశ్వరం(ముక్తేశ్వరం) ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన తర్వాత బ్యాక్‌వాటర్‌ ప్రభావంతోపాటు గతంలో వచ్చిన వరదకు చిన్న కాళేశ్వరంలోని పంపుహౌస్‌ నీటమునిగింది. కాళేశ్వరం నిర్మాణం నేపథ్యంలో దీన్ని పూర్తిగా పక్కనపెట్టడంతో అప్పటివరకు చేసిన పనులు కూడా దెబ్బతిన్నాయి. దీని పునరుద్ధరణకు ఉన్న అవకాశాలు, తాజాగా నిర్మాణ వ్యయం, భూసేకరణ తదితర అంశాలపై అధ్యయనం చేసి పది రోజుల్లోగా నివేదిక సమర్పించాలని నీటిపారుదల శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఈ ప్రాజెక్టుపై బుధవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌, ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఈ కరుణాకర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు యాదగిరి, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

45,742 ఎకరాల ఆయకట్టు లక్ష్యం

మంథని నియోజకవర్గంలోని మహాదేవపూర్‌, కాటారం, మహాముత్తారం, మల్హర్‌రావు మండలాల్లో 45,742 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు కాళేశ్వరం సమీపంలోని కన్నేపల్లి వద్ద నుంచి నాలుగున్నర టీఎంసీలు ఎత్తిపోసేలా ఈ పని చేపట్టారు. 2007 అక్టోబరులో రూ.443 కోట్లకు అప్పటి ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత 2007-08 ధరలతో సాంకేతిక అనుమతి ఇచ్చే సమయానికి భూసేకరణ, అటవీ అనుమతి.. ఇలా అన్నింటినీ కలిపి రూ.632 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతి ఇచ్చింది. టెండర్‌ పిలవగా రూ.499.23 కోట్లకు ఐవీఆర్‌సీఎల్‌-కేబీఎల్‌-ఎంఈఐఎల్‌ జాయింట్‌ వెంచర్‌ పని దక్కించుకుంది. రెండు పంపుహౌస్‌ల నిర్మాణంతోపాటు 13 చెరువుల సామర్థ్యం పెంచడం తదితర పనులు ఇందులో ఉన్నాయి. కన్నేపల్లి వద్ద మొదటి పంపుహౌస్‌ నిర్మించడం, దీని నుంచి రెండో పంప్‌హౌస్‌కు తీసుకెళ్లి ఆయకట్టుకు నీళ్లివ్వడం లక్ష్యం. మొదటి పంపుహౌస్‌ కింద కూడా సుమారు 10 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ పథకం నిర్మాణానికి 3,625 ఎకరాల భూమిని సేకరించడంతోపాటు 637 ఎకరాల అటవీ భూమి అవసరం. భూసేకరణలో జాప్యంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. కాళేశ్వరం నిర్మాణం తర్వాత దీనికి ప్రాధాన్యం లేకుండాపోయింది. 2020 నాటికి సుమారు రూ.350 కోట్లు ఖర్చు పెట్టగా.. ఆ తర్వాత ఎలాంటి పనులు చేయలేదు. 2022 జులైలో వచ్చిన వరదకు పంపుహౌస్‌లు నీటమునిగాయి. మొదటి పంపుహౌస్‌ మేడిగడ్డ బ్యాక్‌ వాటర్‌లో మునుగుతుంది. ఈ నేపథ్యంలో ఎత్తిపోతల పునరుద్ధరణ ఎలాగన్న అంశంపై అధికారులతో మంత్రి ఉత్తమ్‌ చర్చించారు.

తాజా అంచనా తయారు చేశాకే..

మొదటి పంపుహౌస్‌ పనిచేయాలంటే మేడిగడ్డ బ్యాక్‌వాటర్‌ నుంచి రక్షణకు ప్రత్యేకంగా గోడ నిర్మించాల్సి ఉంటుంది. మరోవైపు 2007-08 ధరలతో ప్రస్తుతం గుత్తేదారు పనిచేసే అవకాశం లేదు. ఉన్న గుత్తేదారుతో పని చేయించాలన్నా.. మళ్లీ టెండర్‌ పిలిచి కొత్త గుత్తేదారుకు ఇవ్వాలన్నా తాజా ధరలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చేయాల్సిన పనికి తాజా ధరలు, కొత్తగా మొదటి పంపుహౌస్‌కు రక్షణ గోడ, పెరిగిన భూసేకరణ వ్యయం.. ఇలా అన్నింటినీ కలిపి తాజా అంచనాను తయారు చేసిన తర్వాత ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని