క్రైస్తవులకు ప్రభుత్వ రక్షణ

రాష్ట్రంలో చర్చిల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని, కొత్త వాటి నిర్మాణానికి అనుమతులు సులభతరం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Published : 29 Feb 2024 05:15 IST

రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు ముందుకు రావాలి
క్రైస్తవ సంఘాల సమావేశంలో సీఎం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో చర్చిల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని, కొత్త వాటి నిర్మాణానికి అనుమతులు సులభతరం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. క్రైస్తవులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. తెలంగాణలోని అన్నివర్గాల ప్రజల సహకారంతో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, తమ హయాంలో మతపరమైన స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ తరహాలో కేంద్రంలోనూ లౌకిక ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని క్రైస్తవ సంఘాలను కోరారు. 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన ఎంపీ సీట్లతో కేసీఆర్‌.. నరేంద్రమోదీ తీసుకువచ్చిన ఆర్టికల్‌ 370 రద్దు, జీఎస్టీ, నోట్ల ఉపసంహరణ, రైతు వ్యతిరేక బిల్లులకు మద్దతు ఇచ్చారన్నారు. బుధవారం సచివాలయంలో మెదక్‌ డయాసిస్‌ బిషప్‌ పద్మారావు, రెవరెండ్‌ జాన్‌జార్జ్‌, డాక్టర్‌ ఏఎంజే కుమార్‌, శ్యామ్‌ అబ్రహం, అనిల్‌ థామస్‌తోపాటు వివిధ చర్చిలకు చెందిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా చర్చి ఆస్తుల ఆక్రమణలతోపాటు క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. త్వరలోనే సీఎం హోదాలో మెదక్‌ చర్చిని సందర్శిస్తానని వారికి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ‘‘2014 తరువాత దేశంలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వాలు ఏర్పడ్డాక భయానక పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో అల్లర్లు, ఘర్షణలు జరిగితే పాలకులు అణచివేసేవారు. కానీ ప్రస్తుతం పాలకులుగా ఉన్నవారే ఘర్షణలకు కారణమవుతున్నారు. రాహుల్‌ అనుకుంటే యూపీఏ పదేళ్ల పాలనలో పీఎం అయ్యేవారు. ఏరోజూ పదవి కోసం ఆశపడకుండా, ప్రజలను కలిపి ఉంచడమే లక్ష్యంగా వ్యవహరించారు. ప్రజల మధ్య ద్వేషాన్ని రూపుమాపి, ప్రేమను పెంచేందుకు భారత్‌ జోడో యాత్ర చేపట్టారు. రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు ప్రతిఒక్కరూ మద్దతు తెలపాలి’’ అని సీఎం రేవంత్‌కోరారు.

పసుపు బోర్డును ఏర్పాటు చేయాలి: సీఎం

కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో వెంటనే పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం ‘ఎక్స్‌’ వేదికగా సీఎం స్పందించారు. ‘‘నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో పసుపునకు రూ.14వేల మద్దతు ధర దక్కడం సంతోషకరం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డును నెలకొల్పితే.. రైతులకు శాశ్వత మేలు జరుగుతుంది. తక్షణం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని డిమాండ్‌ చేస్తున్నా’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని