పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వాలు కృషిచేయాలి

పేద విద్యార్థులు, ప్రజల ఆకలి తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కృషిచేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అభిప్రాయపడ్డారు.

Published : 29 Feb 2024 03:15 IST

‘అక్షయ పాత్ర’ వంటి సంస్థలను ప్రోత్సహించాలి
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ

సంగారెడ్డి మున్సిపాలిటీ, కంది, న్యూస్‌టుడే: పేద విద్యార్థులు, ప్రజల ఆకలి తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కృషిచేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అభిప్రాయపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో పేదలకు ఉచిత భోజన పథకాలు ప్రారంభించినా, వివిధ కారణాలతో అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదన్నారు. లాభాపేక్ష లేకుండా పేద విద్యార్థుల ఆకలి తీరుస్తున్న ‘అక్షయ పాత్ర’ వంటి సంస్థలను ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి సంస్థలకు ప్రభుత్వాలతోపాటు అందరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని అక్షయ పాత్ర ఫౌండేషన్‌ 15వ వార్షికోత్సవానికి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పక్క కుటుంబంలో అశాంతి ఉంటే మనం సుఖంగా ఉండలేమని, దాన్ని మన సమస్యగా భావించి పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు. ‘సమాజసేవ, సామాజిక స్పృహ’ అనే భావనలు ప్రతిఒక్కరూ కలిగి ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు ‘అక్షయ పాత్ర’ 15 ఏళ్లుగా నాణ్యమైన భోజనం అందించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అనంతరం ఫౌండేషన్‌ నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు మధు పండిత దాస, హైదరాబాద్‌ ప్రాంత అధ్యక్షుడు సత్యగౌరచంద్ర, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుమునుపు జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అక్షయ పాత్ర వంటశాలను పరిశీలించారు. దాని నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని