డిశ్ఛార్జి పిటిషన్‌లపై తేల్చడానికి ఏప్రిల్‌ 30 వరకు గడువు

సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులతోపాటు ఇతర నేతలపై ఉన్న కేసుల్లోని డిశ్ఛార్జి పిటిషన్లను తేల్చడానికి ఏప్రిల్‌ 30 వరకు గడువు పొడిగిస్తూ హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 29 Feb 2024 03:18 IST

జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో హైకోర్టు అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులతోపాటు ఇతర నేతలపై ఉన్న కేసుల్లోని డిశ్ఛార్జి పిటిషన్లను తేల్చడానికి ఏప్రిల్‌ 30 వరకు గడువు పొడిగిస్తూ హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. నేతలపై ఉన్న కేసుల సత్వర విచారణకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ప్రత్యేక బెంచ్‌ సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సీబీఐ కోర్టులో ఉన్న 20 కేసుల్లోని నిందితుల డిశ్ఛార్జి పిటిషన్లను రెండు నెలల్లోగా తేల్చాలని గత ఏడాది డిసెంబరు 15న ఆదేశించింది. ఆ గడువులోగా విచారణ పూర్తికాకపోవడంతో సీబీఐ కోర్టు హైకోర్టు రిజిస్ట్రీకి డిసెంబరు 15న లేఖ రాసింది. జగన్‌ అక్రమాస్తులకు సంబంధించి సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన కేసుల్లో నిందితుల సంఖ్య, పెండింగ్‌ ఉన్న పిటిషన్లు, సుదీర్ఘ వాదనల నేపథ్యంలో విచారణను పూర్తి చేయలేకపోయినట్లు తెలిపింది. డిక్టేషన్‌ భాగాలు సుమారు 13,000 పేజీలు సిద్ధమయ్యాయని, దిద్దుబాట్లు కూడా పూర్తయ్యాయన్నారు. భారీ రికార్డులు, అధిక సంఖ్యలో సాక్షులు, వారు ఇచ్చిన వాంగ్మూలాలు ఉన్నాయని, అందువల్ల డిశ్ఛార్జి పిటిషన్‌లపై తేల్చడానికి గడువు పొడిగించాలంటూ సీబీఐ కోర్టు అభ్యర్థించింది. దానిని పరిగణలోకి తీసుకున్న ప్రత్యేక ధర్మాసనం ఏప్రిల్‌ 30లోగా తేల్చడానికి అనుమతించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని