గరిష్ఠ వాడకం ఏడాదికి 8 సిలిండర్లు!

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ గ్యాస్‌ పథకానికి అర్హుల జాబితా రూపొందించిన పౌరసరఫరాల శాఖ.. ఏడాదికి ఎవరికి ఎన్ని సిలిండర్లకు సబ్సిడీ ఇవ్వాలన్న విషయంపై లెక్కలు సిద్ధం చేసింది.

Updated : 29 Feb 2024 07:38 IST

మూడేళ్ల సగటు లెక్కల్లో తేలిందిదే..
ఈ జాబితాలో 9.10 లక్షల మంది
కనెక్షన్‌ ఉన్నా గ్యాస్‌ వాడని వారి సంఖ్య 1.10 లక్షలు

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ గ్యాస్‌ పథకానికి అర్హుల జాబితా రూపొందించిన పౌరసరఫరాల శాఖ.. ఏడాదికి ఎవరికి ఎన్ని సిలిండర్లకు సబ్సిడీ ఇవ్వాలన్న విషయంపై లెక్కలు సిద్ధం చేసింది. రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి అర్హులైనవారి మూడేళ్ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ లెక్కన ఏటా ఇవ్వాల్సిన గరిష్ఠ సిలిండర్ల సంఖ్య ఎనిమిదిగా తేలింది. ఈ పథకానికి కొద్దిరోజుల క్రితం 39.78 లక్షల మందిని అర్హులుగా అధికారులు తేల్చారు. తర్వాత ఆ సంఖ్య 39.50 లక్షలకు తగ్గింది. ఇది మరికొంత తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం. అర్హుల్లో దాదాపు 9.10 లక్షల మంది అత్యధికంగా ఏటా 8 గ్యాస్‌ సిలిండర్ల చొప్పున వినియోగించారని పౌరసరఫరాలశాఖ తేల్చింది. దీంతో ఈ పథకంలో సబ్సిడీపై ఇవ్వబోయే సిలిండర్ల సంఖ్య గరిష్ఠంగా ఏడాదికి ఎనిమిదిగా నిర్ధారణ అయ్యింది. మొత్తంగా ప్రభుత్వం భరించాల్సిన సబ్సిడీ నెలకు రూ.71.27 కోట్లు, ఏడాదికి రూ.855.2 కోట్లుగా తేలింది. ఇందులో ఉజ్వల కనెక్షన్‌ వినియోగదారులకు రూ.38.57 కోట్లు, సాధారణ గ్యాస్‌ కనెక్షన్‌దారులకు రూ.816.65 కోట్లు ఖర్చవుతుందని అంచనా. రాష్ట్రంలో ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్‌దారులు 11.58 లక్షల మంది ఉన్నా.. సబ్సిడీ సిలిండర్‌ కోసం 5.89 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఉజ్వల గ్యాస్‌పై కేంద్రం ప్రతి సిలిండర్‌కు రూ.340 సబ్సిడీ ఇస్తుండడంతో వీటిపై రాష్ట్ర ప్రభుత్వం రూ.155 చొప్పున రాయితీ భరిస్తే సరిపోతుంది.

మూలన పెట్టిన బండ.. మళ్లీ వినియోగంలోకి

మూడేళ్ల గ్యాస్‌ వాడకం లెక్కలు తీయగా.. కొందరు అతి తక్కువగా గ్యాస్‌ వినియోగిస్తుంటే మరికొందరు అసలు గ్యాస్‌ వాడడం లేదని తేలింది. గత మూడేళ్లలో సిలిండర్‌ను ఒక్కసారి కూడా తీసుకోని వినియోగదారుల సంఖ్య 1,10,706. వీరిలో ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నవారు 18,073 మంది కాగా.. సాధారణ కనెక్షన్‌దారులు 92,633 మంది. ఇన్నాళ్లూ గ్యాస్‌ బండను వాడకుండా పక్కన పెట్టిన వీరంతా ఇప్పుడు సబ్సిడీ సిలిండర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని